మధ్యాహ్న భోజనంలో ఎలుకల అవశేషాలు... ఇస్కాన్ సంస్థ కాంట్రాక్ట్ రద్దుకు డిమాండ్
Recommended Video

కడప: కడప నగరంలోని పాఠశాలలకు ఇస్కాన్ సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనంలో సోమవారం ఎలుకల అవశేషాలు కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఆహారాన్ని అప్పటికే కడప మండలంలోని 134 పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలిసింది.
అయితే భోజనంలో ఎలుకల అవశేషాలు ఉన్నట్లు గమనించిన విద్యార్థులు ఆ భోజనం తినలేదని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా సరఫరా చేసిన పప్పులో ఈ ఎలుకల అవశేషాలు ఉన్నట్లు తెలిపారు. అయితే భోజన తయారీని ఇటీవలే ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే....

కడప నగరం సరోజినినగర్ ఆదర్శ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం పప్పులో ఎలుక అవశేషాలు ఉన్నట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఎలుకల అవశేషాలను గుర్తించినట్లు తెలిసింది. పప్పులోని ఎలుకల అవశేషాలను ఏరి ఒక ప్లేటులో కుప్పగా పోశారు. ఈ అవశేషాలను విద్యార్థులు భోజనం చేయకముందు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే అప్పటికే ఈ ఆహారాన్ని కడప మండలంలోని 134 పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలియడంతో వెంటనే అన్ని పాఠశాలలను అప్రమప్తం చేశారు. అన్నిచోట్లా అప్పటికి విద్యార్థులు ఇంకా భోజనం చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు.
మరోవైపు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే మధ్యాహ్న భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. అయితే దీన్ని ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం తయారు చేసిన నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలుకల ఘటన చోటుచేసుకోగా విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు పప్పులో ఎలుకల అవశేషాలకు సంబంధించి ఇస్కాన్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయితే పప్పులో బైటపడింది ఎలుకల అవశేషాలు కాదని, చెక్కని ఇస్కాన్ సంస్థ ప్రతినిథులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications