ఇలాగైతే రాజీనామా చేస్తా: రాయపాటి నిరసన గళం
గుంటూరు: ప్రజలకు సంబంధించిన పనులు కావడం లేదని, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం చేసేవారు లేరని, పరిస్థితి ఇదేవిధంగా ఉంటే రాజీనామా చేస్తానని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు.
గుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో మంగళవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివిధ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాయపాటి తన నిరసన గళం వినిపించారు. నియోజకవర్గ సమస్యలపై మంత్రులు, అధికారులకు ఏడాదిన్నర కాలంలో అనేక వినతిపత్రాలు ఇచ్చానని, అవి ఇంతవరకు పరిష్కారం కాలేదని అన్నారు.

నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరానని, అధికారులు ట్యాంకర్లు పెట్టకపోవడంతో సొంతంగానే ఏర్పాటు చేశానని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న మంచినీటి పథకాలు పూర్తి చేసేందుకు అంచనాలను తయారు చేయాలని అధికారులను కోరితే పట్టించుకోలేదని అన్నారు.
దుర్గిలో పల్నాడు మిర్చి యార్డు సమస్య నాలుగైదేళ్లుగా ఉందని, దీనిపై కలెక్టర్, ఇతర అధికారులకు అనేక సార్లు లేఖలు ఇచ్చినా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా ముఖ్యమంత్రితో చెప్పి సమస్యలు పరిష్కరించండి అని మంత్రి పుల్లారావును కోరారు. అధికారుల పనితీరు ఇదేవిధంగా ఉంటే రాజీనామా చేస్తానని రాయపాటి హెచ్చరించారు. దీనితో మంత్రి జోక్యం చేసుకుని ఎంపీ అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications