టీడీపీలోకి కన్నా - ఎవరికి ఉండేది వాళ్లకు ఉంటుంది: రాయపాటి కీలక వ్యాఖ్యలు..!!
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తున్న వేళ మాజీ ఎంపీ రాయపాటి కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా టీడీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కన్నా టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్నా.. ఇప్పటికే టీడీపీతో ఒప్పందం ఖరారైందని సమాచారం. ఈ నేపథ్యంలో చాలా కాలం ఒకే పార్టీలో ఉన్నా భిన్న వర్గాలుగా వ్యవహరించిన కన్నా - రాయపాటి కలిసి పని చేస్తారా అనే చర్చ మొదలైంది. దీని పైన మాజీ ఎంపీ రాయపాటి స్పందించారు. గతంలో తన కుమారుడికి సీటు ఇవ్వాలనే డిమాండ్ రాయపాటి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కన్నా టీడీపీలోకి ఎంట్రీ పైనా కీలక వ్యాఖ్యలు చేసారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన కలవటం ఖాయమని మాజీ ఎంపీ రాయపాటి స్పష్టం చేసారు. కన్నా తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని చెప్పారు. కన్నాకు అప్పట్లో కాంగ్రెస్ లో వైఎస్..జనార్ధన్ రెడ్డి మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో కన్నా పెదకూరపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను గుంటూరు ఎంపీగా పోటీ చేసిన అంశాన్ని గుర్తు చేసారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తే వారికి మద్దతుగా నిలుస్తామని స్పస్టం చేసారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుందని...తనకు ఉండేది తనకు ఉంటుందంటూ రాయపాటి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

గత ఎన్నికల్లో రాయపాటి టీడీపీ నుంచి..కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి నర్సరావుపేట ఎంపీ అభ్యర్దులుగా పోటీ చేసారు. వీరిద్దరి పైనా వైసీపీ నుంచి పోటీ చేసిన లావు శ్రీక్రిష్ణ దేవరాయులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావు..జి వి ఆంజనేయులు.. యరపతినేని లాంటి వారికి ఆర్థిక సాయం చేశామని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ తనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నరసరావుపేట అసెంబ్లీ సీటు చదలవాడ అరవింద్ బాబు దే అని... ఈ సారి అరవింద్ బాబు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు. రాయపాటి గతంలో తన కుమారిడికి సీటు ఇవ్వాలని..ఇప్పుడు నర్సరావుపేట సీటు అరవింద్ కే దక్కుతుందని చెప్పటం కొత్త చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications