కలిసిపోయిన చిరకాల ప్రత్యర్థులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తన దూకుడు పెంచారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలందరితో కన్నా.. తన నివాసంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు నియోజకవర్గ ఇన్ ఛార్జిలు మినహా టీడీపీలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే అందరూ కలిసి సమష్టిగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో వైరివర్గంగా కొనసాగిన మాజీ మంత్రి కన్నా, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కన్నా ఇచ్చిన ఆత్మీయ విందుకు రాయపాటి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కన్నా, రాయపాటి సాంబశివరావు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగేవి. 2014లో కన్నా బీజేపీలో చేరగా, రాయపాటి టీడీపీలో చేరారు. ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులు వేసుకున్నారు. ఇటీవలే ఈ కేసులకు సంబంధించి ఇరువర్గాలు రాజీ చేసుకున్నాయి.

గతంలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నిర్ణయించారు. కన్నా, రాయపాటి వర్గాలు కలిసిపోవడంవల్ల తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 17 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మూడు లోక్ సభ సీట్లలో కూడా విజయం సాధించేలా చూడాలని నిర్ణయించారు. సమావేశం తర్వాత నేతలంతా గురజాలలోని టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని, ముఖ్యమంత్రి జగన్ అన్నిరంగాల్లో విఫలయ్యారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని, అమరావతి కోసమే తాము పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications