తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణాలివే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మంత్రి!
తిరుపతిలో పద్మావతి పార్కు వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన పండుగ వేళ ప్రతి ఒక్కరి మనసులను కలచివేసింది. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తీసుకుని వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భావించిన భక్తులు మృతి చెందడంతో పెను విషాదం చోటుచేసుకుంది.
తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమిదే : దేవాదాయ శాఖా మంత్రి ఆనం
ఇక ఈ ఘటన పైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేస్తారు. తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన చాలా దురదృష్టకరమైనది, ఎంతో బాధాకరమైనదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఒక మహిళకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయి స్పృహ కోల్పోవడంతో ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు గేటు తెరిచారన్నారు.

ఘటనా స్థలాన్ని సీఎం పరిశీలించి వైఫల్యాలను గుర్తించారు
అయితే టోకెన్లు ఇస్తున్నారని భావించిన భక్తులు ఒక్కసారిగా గేటు మీద పడ్డారని అందుకే తొక్కిసలాట జరిగిందని మంత్రి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారని అధికారుల వైఫల్యాలను ఆయన కూడా గుర్తించారని మంత్రి తెలిపారు. ఒకవైపుగా తెరవాల్సిన గేట్లను మరోవైపు తెరవటంతో ఘటన చోటు చేసుకున్నట్టుగా వెల్లడించారు. ఇన్చార్జిగా పెట్టిన డిఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారి ఘటన జరిగిన సమయంలో అక్కడ లేకుండా ఎక్కడికో వెళ్లారని ఆయన తెలిపారు.
ఆరుగురికి పోస్ట్ మార్టం.. మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు
ఇక ఈ ఘటనలో మృతులు నలుగురు ఏపీకి చెందినవారు కాగా, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళ రాష్ట్రానికి చెందినవారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక చనిపోయిన ఆరుగురికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించే అంబులెన్స్ లలో మృతదేహాలను, ప్రత్యేక వాహనాలలో కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు పంపించినట్టు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వారితో పాటు ఒక రెవెన్యూ అధికారిని కూడా తోడుగా పంపించినట్టు ఆయన పేర్కొన్నారు.
స్విమ్స్ లో బాధితులు, పరామర్శించిన సీఎం చంద్రబాబు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన 35 మందికి రుయా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారని ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇక మంత్రుల సబ్ కమిటీ ప్రతి బాధితుడిని కలిసి వివరాలను సేకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గంటన్నర పాటు 35 మంది పేషంట్లను వ్యక్తిగతంగా పరామర్శించినట్టు వారి నుండి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరిహారం
ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల సహాయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే నేడు తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కొనసాగుతుంది . తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం పైన ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. మృతుల స్వస్థలాలకు వెళ్లి చెక్కులు అందజేయడం పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications