గల్లా ఫ్యామిలీకి హైకోర్టులో ఊరట-జగన్ సర్కార్ ఆదేశాలకు బ్రేక్
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యసాగుతున్న రాజకీయ పోరు ప్రభుత్వాల నిర్ణయాలకు పాకుతోంది. ఇదే క్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్ధకు గతంలో చంద్రబాబు హయాంలో కేటాయించిన భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది.
చిత్తూరు జిల్లా కరకంబాడిలో అమర రాజా బ్యాటరీస్ సంస్ధకు గతంలో టీడీపీ సర్కార్ భూములు కేటాయించింది.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు మొదలుకాలేదనే సాకుతో ఈ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రాజకీయ కుటుంబానికి చెందిన సంస్ధ, భూములు కావడంతో దీనిపై విమర్శలు వచ్చాయి. అయినా అధికారులు లెక్క చేయలేదు. ప్రభుత్వ ఆదేశాలతో భూముల స్వాధీనానికి పావులు కదిపారు. ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరింది.

అమరరాజా సంస్ధకు గతంలో కేటాయించిన భూముల్లో పనులు మొదలుకాలేదనే కారణంతో స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు ఇవాళ బ్రేక్ వేసింది. కరకంబాడిలో ఉన్న ఈ భూములపై స్టేటస్ కో(యథాతథస్ధితి) కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు అమలు కానున్నాయి. హైకోర్టు తదుపరి విచారణలో భూముల కేటాయింపుతో పాటు ఇతర అంశాల్ని పరిశీలించనుంది. అప్పటివరకూ స్టేటస్ కో కొనసాగుతుందని పేర్కొంది.
గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కొత్త యూనిట్లను స్ధాపించేందుకు కరకంబాడిలో ఈ భూములు కేటాయించారు. అయితే వాటిని నెలకొల్పడంలో సమస్యలు తలెత్తడం, అంతలో టీడీపీ స్ధానంలో వైసీపీ ప్రభుత్వం అదికారం చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పెరగడంతో అమరరాజా సంస్ధ తమ యూనిట్లను తమిళనాడుకు తరలించేందుకు సైతం సిద్ధమైంది. చివరికి విమర్శలతో ప్రభుత్వం కాస్త దూకుడు తగ్గించింది.












Click it and Unblock the Notifications