Nick Vujicic : వైఎస్ జగన్ తో మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ భేటీ-విద్యాసంస్కరణలకు ప్రశంస..
ప్రపంచవ్యాప్తంగా తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపుతున్న మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఇవాళ వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఆయన చేపడుతున్న విద్యాసంస్కరణల్ని ప్రశంసించారు.
ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఇవాళ ఏపీకి వచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో ఆయన పలు అంశాల్ని చర్చించారు. ఏపీలోని పాఠ్యాంశాల్లో తన పాఠం చేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు నిక్ వుజిసిక్ ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 78 దేశాల్లో తాను పర్యటించానని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారన్నారు.
ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని నిక్ వుజిసిక్ ప్రశంసించారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశమన్నారు. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోందని, ఇది అందరికీ తెలియాల్సి ఉందన్నారు.
ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు నిక్ వుజిసిక్ వెల్లడించారు. తన పట్ల, తన జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద తన జీవిత కథను ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారని, ఇది తనకు చాలా ఆనందం కలిగించే విషయమన్నారు.

విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని నిక్ వుజిసిక్ తెలిపారు. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే ఆయన హీరో అన్నారు. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదన్నారు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అన్నారు.ఆయనను కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications