• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తీర్మానం తెల్ల కాగితం కాదు, బ్రహ్మాస్త్రమే: కిరణ్ రెడ్డి

By Pratap
|

హైదరాబాద్: అసెంబ్లీ తీర్మానం ఉత్తి కాగితం కాదని, తెల్లకాగితం అసలే కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ తీర్మానం వెనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆత్మాభిమానం ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటిదాకా అసెంబ్లీ తీర్మానం లేకుండా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రాన్నీ విభజించలేదని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన బిల్లు సోమవారం ఢిల్లీ చేరుతున్న స్థితిలో ఆదివారం ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలో, విడిపోవాలో నిర్ణయించాల్సింది తెలుగు ప్రజలేనని, రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలకు నిర్ణయం చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. తొండి తీర్మానమంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయనకు చురకలు అంటించారు. అసెంబ్లీలో బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా వ్యంగ్యంగా స్పందించారు.

కొందరు మూజువాణి ఓటు అంటే తొండి ఆట అని అంటున్నారని, దీన్ని చెల్లని తీర్మానమంటున్నారని, మూజువాణి ఓటు అంటే 'ఎవరూ వ్యతిరేకించని, ఎవరూ సవాలు చేయనిది' అని అర్థమని ముఖ్యమంత్రి అన్నారు. పార్లమెంటులోగానీ, అసెంబ్లీలోగానీ 80 నుంచి 90 శాతం బిల్లులు మూజువాణీ ఓటుతోనే పాసవుతా యని, ఇటీవల పార్లమెంటు ఆమోదించిన లోక్‌పాల్, ఆహార భద్రత బిల్లులు కూడా ఇలాగే గట్టెక్కాయని అన్నారు.

Kiran kumar Reddy

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను కూడా పార్లమెంటు ఇదేవిధంగా ఆమోదించిందని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పద్ధతిలోనే ఏర్పడ్డాయనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. 'మేం సీనియర్ పార్లమెంటేరియన్లం, మేధావులం, తలలుపండిన నేతలం' అని చెప్పుకొనేవారు కూడా పదవీకాంక్షతో మారిపోయారని ఆయన జైపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

అసెంబ్లీ చేసిన తీర్మానం తెల్ల కాగితమే అయితే తీర్మానం చేసిన 15 నిమిషాల్లో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఎందుకు స్పందించారని ఆయన అడిగారు. పది నిమిషాల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు బయటికొచ్చి మాట్లాడారని అడిగారు. ఇది ఉత్త తెల్లకాగితమైతే ఎందుకు వణుకు పుడుతోందని ఆయన అన్నారు.

తీర్మానం ఉత్త కాగితం కాదని, సమై క్య రాష్ట్రం కోసం వేసిన బ్రహ్మా స్త్రమని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రాలు వస్తే తీర్మానం తప్పక ఆమోదం పొందాల్సిందేనని అన్నారు. తీర్మానం లేదా మోషన్ ద్వారానే సభాభిప్రాయం తెలుస్తుందని ఆయన అన్నారు.

ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన బిల్లు అని, రాష్ట్రం నుంచి వీగిపోయి వెళుతోందని, ఇలా జరగడం స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి అని ఆయన అన్నారు. బిల్లు అసమగ్రంగా ఉందని, పైగా వీగిపోయిందని ఆయన అన్నారు. ఈ రెండింటినీ రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు అసెంబ్లీలో కలిసి వచ్చినట్లుగానే ఇకపైనా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు కలిసి రావాలని కోరుతున్నానని ఆయన అన్నారు. అంతా కలిసి ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతికి అభిప్రాయాలు తెలియజేయవచ్చునని ఆయన అన్నారు.

బిల్లుపై సభలో అభిప్రాయం చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తాను అవకాశం ఇవ్వాల్సిన అవసరంలేదని, అది స్పీకర్ ఇవ్వాలని ఆయన అన్నారు. కొందరికి మాత్రం అవకాశం దొరకలేదని ఆయన అన్నారు. విభజనపై పదేపదే వారి అభిప్రాయం మార్చుకున్నవారు అవకాశం వచ్చినా రానట్లు, వచ్చి ఉంటే బాగుండు అన్నట్లుగా చెబుతున్నారని ఆయన అన్నారు.

English summary
CM Kiran kumar Reddy said that resolution on Telangana draft bill is a weapon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X