నేడే కర్ణాటక సీఎల్పీ భేటీ: నూతన కేబినెట్ లో నలుగురు డిప్యూటీలు?
కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కొత్త ప్రభుత్వ రూపకల్పనపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. నాయకత్వ మార్పునకు సంబంధించిన రోడ్‌మ్యాప్ ఖరారు చేయడానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ శుక్రవారం జాతీయ రాజధాని ఢిల్లీలో హైకమాండ్‌తో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.
వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. డీకే శివకుమార్ ఈ తెల్లవారు జామున ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కాగా నూతన నాయకుడి ఎన్నిక కోసం శాసనసభాపక్షం నేడు సమావేశం కాబోతోంది. సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో ఈ భేటీ ఏర్పాటైంది. ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల ద్వారా నూతన నాయకుడిని లాంఛనంగా ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

ఈ సమావేశం అనంతరం ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేస్తారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కేబినెట్ కూర్పులో సమూల మార్పులకు సిద్ధమవుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యాంటీ ఇన్‌కంబెన్సీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కామరాజ్ ప్లాన్ మోడల్‌ను అమలు చేయాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా మంత్రివర్గంలో సగం మంది కొత్త ముఖాలను ప్రవేశపెట్టాలని సీనియర్ నేతలు సూచించారు.
కామరాజ్ ప్లాన్ కింద మూడేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న సీనియర్ మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి, వారిని క్షేత్రస్థాయి పార్టీ సంస్థాగత పనుల కోసం తిరిగి నియమించే అవకాశం ఉంది. చీఫ్ విప్ సలీం అహ్మద్, మాజీ మంత్రి ఎం వీరప్ప మొయిలీ వంటి సీనియర్ నాయకులు ఈ ప్రతిపాదనను బలపరిచారు. కేబినెట్ లో 50 శాతం కొత్తవారికి కేటాయించాలని తాము మొదటి నుంచీ చెబుతూనే వస్తోన్నామని వారు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రాంతీయ, సామాజిక, కుల సమతుల్యతను పటిష్ఠంగా కొనసాగించేందుకు, డీకే శివకుమార్ నాయకత్వంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించే విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం చురుకుగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవంక మంత్రివర్గ పదవుల కోసం తీవ్రస్థాయిలో లాబీయింగ్ మొదలైంది. కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో సహా ఏడుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తమ జిల్లాకు మూడు మంత్రి పదవులు కావాలని కోరుతూ మల్లికార్జున ఖర్గేకు ఒక లేఖను సమర్పించారు.
దళిత కోటా కింద ఎస్ఎన్ నారాయణస్వామి, జనరల్ కోటా కింద కేవై నంజేగౌడ, కోథూర్ జీ మంజునాథ్‌లకు బెర్త్‌లు కల్పించాలని వారు అభ్యర్థించారు. బసవరాజ్ శివణ్ణనవర్, ఇతర ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేబినెట్ కూర్పుతో పాటు, రాబోయే రాజ్యసభ, శాసనమండలి ఖాళీల కోసం అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేస్తోంది. ఈ చివరి ఎంపిక జాబితాలు తన పరిధిలోకి రావని డీకే శివకుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications