సంచలనం: చంద్రబాబు సన్నిహితుల ఫోన్ల ట్యాపింగ్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఫోన్లను ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసినట్లు తెలుస్తోందంటూ బుధవారం సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఎల్లవేళలా చంద్రబాబు చుట్టూ ఉండే వారి ఫోన్లు , చంద్రబాబు తరుచూ మాట్లాడే ఫోన్ల వివరాలపై ఆరా తీసింది.
ప్రభుత్వంలోని కొందరు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారన్న దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిత్యం నిఘా పెడుతున్న వైనం వెలుగుచూసిందంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తాకథనం సారాంశం.

చంద్రబాబుపై కూడా ఆధారాలున్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్య నేపథ్యంలో ఆ వార్తలకు ప్రాధాన్యం చేకూరుతోంది. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబును కూడా చేర్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుల నుంచి డిమాండ్లు రావడం కూడా ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ, టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అదే డిమాండ్ చేశారు. కేసులో చంద్రబాబును ఎ1గా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని గవర్నర్‌ను కోరారు. చంద్రబాబును కూడా కేసులో ఇరికించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి యోచన చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications