ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో బిగ్ స్కామ్: ఈడీ విచారణకు రిటైర్డ్ ఐఎఎస్: కీలక ప్రశ్నలు..!!
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణం వ్యవహారంలో కొద్దిరోజుల కిందటే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కే లక్ష్మీనారాయణకు ఇదివరకే నోటీసులు ఇచ్చారు. ఇవ్వాళ ఆయన విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను విచారిస్తోన్నారు.

కీలక ప్రశ్నలు..
వంద కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక ప్రశ్నలను లక్ష్మీనారాయణ ముందు ఉంచారు. వాటన్నింటికీ ఆయన సంతృప్తికరమైన వివరణను ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే స్కాం విషయంలో గత ఏడాది డిసెంబర్‌లో ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కూడా అధికారులు సోదాలను నిర్వహించారు.

ఈడీ జోక్యం..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ)లో సీమెన్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్లస్టర్లను మంజూరు చేసే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై జగన్ సర్కార్ విచారణకు ఆదేశించింది. తొలుత దీన్ని ఏపీ సీఐడీకి అప్పగించింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడం వల్ల ఈడీ అధికారులు ఇందులో జోక్యం చేసుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయనకు నోటీసులు ఇచ్చారు.

ఫోరెన్సిక్ ఆడిట్‌తో..
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ ధృవీకరించడంతో జగన్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ అవినీతి చోటు చేసుకున్న సమయంలో లక్ష్మీనారాయణ ఈ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారని సమాచారం. 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరు క్లస్టర్లకు అనుమతి ఇచ్చింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన క్లస్టర్లు అవి.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద..
ఈ క్లస్టర్‌లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అయిదు టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూటషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పాలనేది ప్రతిపాదనలు. ఒక్కో క్లస్టర్ విలువ 548,84,18,908 రూపాయలు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం. ఈ మేరకు సీమెన్స్ అండ్ డిజైన్ టెక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ప్రభుత్వం. ఈ క్లస్టర్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 491,84,18,908 రూపాయలను కేటాయించింది.

నెట్ వర్క్ కంపెనీల ద్వారా..
ఇందులో ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటా విలువ 55 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. అనంతరం ఈ సీమెన్స్‌తో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకుంది. దీని విలువ 370,78,80,000 రూపాయలు. ఇది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్‌గా నిర్ధారించింది. ఇది కార్యరూపం దాల్చలేదని, అయినప్పటికీ ప్రభుత్వం వాటాగా భావించిన 10 శాతం మొత్తాన్ని వినియోగించుకున్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. మొత్తంగా 241,78,61,508 రూపాయలు నెట్‌వర్క్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు నిర్ధారించింది.












Click it and Unblock the Notifications