మైక్ చూస్తే ఊగిపోయే అనిత మాకొద్దు: టికెట్ ఇస్తే మేమే ఓడిస్తాం: లోకేష్‌కు టీడీపీ నేతలు హెచ్చరిక
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 220వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. కాకినాడ జిల్లా మీదుగా అనకాపల్లిలో అడుగుపెట్టారు.
తుని నియోజకవర్గం పరిధిలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. కాపు నేతలతో సమావేశం అయ్యారు. వారి సాధకబాధకాలను ఆలకించారు. వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పాయకరావుపేటలో నారా లోకేష్‌కు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనల సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha)కు వ్యతిరేకంగా స్థానిక నాయకుగు గళం ఎత్తారు. ఆమెపై కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టారు.
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనిత.. ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆమెపై టీడీపీ క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆమెకు మళ్లీ పాయకరావుపేట నుంచే బరిలో దింపితే ఓటమి ఖాయం అనే భయంతోనే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అనితకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి పోటీ చేయించారు.
సీటు మారినప్పటికీ.. ఓటమి మాత్రం కామన్ అయింది వంగలపూడి అనితకు. కొవ్వూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హోం మంత్రి తానేటి వనిత చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఏకంగా 25,248 ఓట్ల తేడాతో అనిత మట్టికరిచారు. ఆ తరువాత నియోజకవర్గం క్యాడర్‌కెు అందుబాటు ఉండట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.

2024లో మళ్లీ పాయకరావుపేట నుంచే పోటీ చేసేలా పావులు కదుపుతున్నారు వంగలపూడి అనిత. దీనికోసం పార్టీ అగ్రనాయకత్వం వద్ద తన పరపతిని ఉపయోగించుకుంటోన్నారు. ఈ విషయంలో తెలియడంతో పాయకరావుపేట టీడీపీ నేతల్లో కలకలం మొదలైంది. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్ ఊపందుకుంటోంది.
పాదయాత్రగా పాయకరావుపేటకు చేరుకున్న నారా లోకేష్‌కు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు స్థానిక టీడీపీ నాయకులు. పోటీ చేసిన తరువాత నియోజకవర్గాన్ని, నాయకులు, కార్యకర్తల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఆమెకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
ఈ సారి పాయకరావుపేట టికెట్‌ను మళ్లీ వంగలపూడి అనితకే ఇస్తే తాము పని చేయబోమని కుండబద్దలు కొట్టారు. తామే ఓడిస్తామనీ తేల్చి చెప్పారు. తన ముందే కార్యకర్తలు తిరుగుబాటు గళం లేవదీయడంతో నారా లోకేష్ బిత్తరపోయారు. పాదయాత్రను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications