సీమలో కూటమికి సీన్ రివర్స్, ఆ స్థానాలు వైసీపీ వైపే - సర్వే సంచలనం..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాజీ సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. దీంతో, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాటకు సిద్దమయ్యారు. ఇక.. ఏడాది కాలంలో కూటమి ఎమ్మెల్య ల పని తీరు పైన రైజ్ సర్వే సంస్థ రాయలసీమలో చేసిన సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2024 కి భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్లు సర్వే వెల్లడించింది.
మారుతున్న లెక్కలు
ప్రముఖ సర్వే సంస్థ రైజ్ ఏపీలో కూటమి ఏడాది పాలన వేళ ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రజాభి ప్రాయం సేకరిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పరిస్థితిని వెల్లడించింది. తాజాగా రాయలసీమ జిల్లా ల్లోని పరిస్థితిని విశ్లేషించింది. వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. అదే 2024 ఎన్నిక ల్లో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. సీమలో జగన్ (పులివెందుల)తో పాటు దాసరి సుధ (బద్వేల్), అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), విరూపాక్షి (ఆలూరు), ద్వారకనాథ రెడ్డి (తంబళ్లపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు) మాత్రమే విజయం సాధించారు. అయితే, ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు సర్వే స్పష్టం చేస్తోంది.

సీన్ రివర్స్
కాగా, తాజా సర్వే నివేదికలో రాయలసీమలో అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడించారు. కూటమి కొత్త ఎమ్మెల్యేలకు 29లో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. సీమ నుంచి అయిదుగురు మంత్రులు ఉన్నారు. వారిలో రెడ్ జోన్ లో నలుగురు మంత్రులు ఉన్నారంటూ సంచలన అంశాలను వెల్లడించింది. తొలిసారి ఎన్నికైన 90% కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విశ్లేషించింది. చిత్తూరు పార్లమెంటులో కుప్పం, పలమనేరు తప్పితే.. మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్.. అంటూ సర్వే ప్రధాన అంశాల్లో పేర్కొంది. ఇక.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయని సర్వేలో స్పష్టం చేసారు. టీడీపీ సీనియర్ల నియోజక వర్గాలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలంగా ఉన్న ట్లు సర్వేలో తేల్చి చెప్పారు. కాగా, వైసీపీ పరిస్థితి గురించి కీలక అంశాలను వెల్లడించింది.
ఆ స్థానాలు వైసీపీకే
ఇక, జగన్ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో సీమ జిల్లాల్లో ఎన్ని కల వేళ సమీకరణాలు వేగంగా మారాయి. కాగా.. ఇప్పుడు సర్వే నివేదికలో రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ.. అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే (వన్ టైమ్) ఎవరు? టీడీపీదే పెత్తనమంతా! అంటూ వ్యాఖ్యానించారు. కడప ప్రచార ఆర్భాటం ఎక్కువ! క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నం..అంటూ పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు.. ఉన్నాయంటూ కీలక అంశాన్ని సర్వేలో నివేదించారు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పని తీరు పైన వస్తున్న సర్వే నివేదికలతో కూటమి నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications