రిషికేశ్వరి కేసు: పీకల్లోతు చిక్కుల్లో ప్రిన్సిపాల్ బాబూరావు
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు చిక్కుల్లో పడ్డారు. అన్ని వైపుల నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు, ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరును దాదాపు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.
బాబూరావు మాత్రం మీడియా, విచారణ కమిటీ ఎదుట తాను ఏ తప్పూ చేయలేదని, విద్యార్థులు బలవంతం చేస్తేనే ప్రెషర్స్ డే నాడు తాను డ్యాన్స్ చేశానని చెప్పుకున్నారు. తాజాగా వెలుగు చూసిన రిషికేశ్వరి డైరీ కూడా ఆయన పాత్రపై అనుమానాలకు తావు కల్పిస్తోంది.
తన డైరీలో రిషికేశ్వరి రాసిన వ్యాక్యాలు కూడా ఆయన తీరుపై అనుమానాలు కలిగేలా ఉన్నాయి. ఫ్రెషర్స్ డే రోజు జరిగిన గొడవ గురించే రిషికేశ్వరి ప్రధానంగా డైరీలో రాసిపెట్టింది. అంతకుముందు నుంచి వేధింపులు రకరకాలుగా జరుగుతున్నా, పరాకాష్టకు చేరింది మాత్రం ఆరోజేనని ఆమె డైరీ తెలియజేస్తోంది.

సమావేశాలు నిర్వహించడానికి, సంబరాలు చేసుకోవడానికి విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోనే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. దాన్నికాదని దూరంగా ఉన్న రిసార్ట్‌కు ప్రిన్సిపాల్ ఎందుకు వెళ్ళారనేది ప్రశ్నార్థకంగా మారింది. తాగిన మైకంలోనే చరణ్ అనే యువకుడు రిషికేశ్వరి మీద చెయ్యి వేశాడని డైరీలోని విషయాలను బట్టి తెలుస్తోంది.
నిబంధనలను కాదని ప్రిన్సిపల్ అనధికారికంగా తనకు నచ్చిన చోట పార్టీ చేయడమే విద్యార్థిని ప్రాణాల మీదికి తెచ్చిందనేదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి బాబూరావు తప్ప వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్ళలేదు. వేరే ఎవరన్నా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications