భజన అంటే అది.!: చంద్రబాబు, పవన్‌పై రోజా తీవ్ర విమర్శలు
చిత్తూరు: అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగన్ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలు-2022ను రోజా సోమవారం ప్రారంభించారు.

తన పిల్లలు సేవ చేయడం ఆనందమేనంటూ రోజా
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గలవారని.. తన పిల్లలు తన శాఖ ద్వారా సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేకపోవడమేనని అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యార్థులే ప్రతిపక్షాలకు కావాలన్నారు.

భజన అంటే ఇదేనంటూ చంద్రబాబుపై రోజా
రాష్ట్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే టీడీపీవాళ్లు ఓర్వలేకపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు. తాము భజన చేయడం లేదన్నారు. భజన అంటే ఎలా ఉంటుందంటే.. వైయస్సార్ కట్టిన పోలవరం ప్రాజెక్టు దగ్గర 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు.. ఇది భజన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఫూల్ చేశారంటూ రోజా
మరోవైపు, ఆదివారం రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రోడ్డుపై రౌడీలా రోడ్ షోలు చేయడమేంటి? నిజంగా పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలని రోజా సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తిరుగులేని మెజార్టీతో మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. సినిమాల్లో వేషాలు వస్తే.. ప్రజలు ఓటు వేయరని పవన్ కళ్యాణ్ కు రోజా హితవు పలికారు. లోకేష్ ఓడిపోయిన చోటుకు పవన్ కళ్యాణ్ ను పంపి.. ఆయనను చంద్రబాబు ఫూల్ చేశారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబును తిట్టకుండా సీఎంను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications