గుంటూరుకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి పెమ్మసాని
Pemmasani Chandrasekhar: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోన్నామని గుంటూరు లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో రోడ్లు, ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, మంచినీరు, మురుగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు.
గుంటూరు శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని చంద్రశేఖర్ అన్నారు. రెండు మూడు నెలల్లో నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో.. అలాంటి ప్రాంతాలను గుర్తించామని, వాటిపై సమీక్షలను నిర్వహించామని తెలిపారు.

తాజాగా గుంటూరులో కొత్తగా రైల్వే బ్రిడ్జిని నిర్మించడానికి రైల్వే శాఖ 107 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పెమ్మసాని చెప్పారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయమంత్రి సోమణ్న, రైల్వే బోర్డు అధికారులు ఈ మొత్తాన్నిమంజూరు చేశారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
గుంటూరు- నంబూరును కలుపుతూ నిర్మితం కాబోతోన్న నాలుగు లైన్ల ఓవర్ బ్రిడ్జి అని ఆయన వివరించారు. ఇది.. గుంటూరు-నంబూరు- మంగళగిరి- పొన్నూరు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పెమ్మసాని చెప్పారు.
అమరావతి ప్రాంతం పూర్తిస్థాయిలో రాజధానిగా కాబోతోందని, ట్రాఫిక్ పెరిగినప్పటికీ- వచ్చే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్ట్ వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, డీపీఆర్‌ను సమగ్రంగా రూపొందించిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు కేంద్రమంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.












Click it and Unblock the Notifications