రేప్: రాధాకృష్ణపై రోజా, కొత్త పార్టీ పెట్టాలని బాబుకు సవాల్, పవన్ వల్లే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజు సోమవారం నాడు శాసన సభ మీడియా పాయింట్ వద్ద దుమ్మెత్తి పోశారు. బాబు తీరు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైన కూడా మండిపడ్డారు. కొన్ని చానళ్లలో అసెంబ్లీకి సంబంధించిన వీడియోను వన్ సైడ్‌గా టెలికాస్ట్ చేశారని ఆరోపించారు.
తమ పక్కనే కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరిగిందని, అక్కడ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు బల్లలు ఎక్కి గవర్నర్ ప్రసంగానికి అడ్డం తగిలారని, పుస్తకాలు చించి ఆయన పైకి విసిరేశారని, జాతీయ గీతాన్ని అవమానించారని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఇంత చేసినప్పటికీ తెలంగాణ స్పీకర్ అందుకు సంబంధించిన వీడియోలను బయటకు రానీయలేదన్నారు. కానీ ఏపీ అసెంబ్లీలో ఎందుకు అలా జరిగిందని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీలో మహిళలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, టీడీపీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తాను సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించలేదన్నారు. కళాకారుడు (ఎన్టీఆర్) పెట్టిన పార్టీలో పుట్టిన వారు తన పైన ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మహిళలు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ వాట్సప్, ఫేస్ బుక్‌లో తన పైన జోకులు పేల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను మీడియా, ప్రజలు 1994 నుండి చూస్తున్నారని, తన గురించి వారికి తెలుసున్నారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతే ఊరుకునేది లేదన్నారు. తనను ఎదుర్కోలేక తన పైన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాధాకృష్ణ వంటి వ్యక్తి రేప్ అంశంపై రాసిన విషయం దారుణంగా ఉందన్నారు.
కిరణ్మయి అనే సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నకు మాత్రమే తాను సమాధానం చెప్పానని, అందుకు సంబంధించిన పూర్తి క్లిప్పింగ్ చూడాలన్నారు. కిరణ్మయి తన పైన ప్రేమతో చేసిందో లేక కోపంతో చేసిందో లేక టీడీపీపై ప్రేమతో చేసిందో తనకు తెలియదని... రేప్ అంశంపై ఆమె ప్రశ్నకు మాత్రమే తాను సమాధానమిచ్చానని చెప్పారు.
టీడీపీ అధికారంలో ఉంది కదా.. మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు కదా అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే.. ఆడదానికి రెండే ఉన్నాయని, ఒకటి చంపేస్తారని, రెండు మానానికి ఆపద ఉంటుందని, ఆ రెండు వారు చేయగలరా అని ప్రశ్నించానని, దానిని ఎవరు కూడా పూర్తిగా చూపించకుండా, తన పైన ఇలాంటి మచ్చ వేయడం సరికాదన్నారు.
సభ విషయమై మాట్లాడుతూ.. కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయో సభాపతి చెప్పాలన్నారు. గుంటూరులో ఆదివారం నాడు మీటింగ్ పెట్టి ఆర్టీఐ కింద ఎవరు ఏమి అడిగినా ఇస్తామని చెప్పారని, తాము అడిగినవి ఇవ్వడం లేదని, కానీ తమను అవమానపరిచేలా ఉన్న క్లిప్పింగ్స్ మాత్రం వెంటనే ఇచ్చారన్నారు. టీడీపీ మాటలను సైలెంట్ చేసి, తమ హావభావాలు చూపించారని మండిపడ్డారు.

తాను చంద్రబాబు కాలి గోటికి సరిపోనని మంత్రి పీతల సుజాత అంటే.. చంద్రబాబే తన గోటికి సరిపోరని తాను అన్నానని, తనకు దళితులు అంటే గౌరవముందని చెప్పారు. తాను దళితులను కించపర్చలేదన్నారు. బోండా ఉమ తనను రోజా ఆంటీ అనడం విడ్డూరమన్నారు.
చంద్రబాబు అవుటాఫ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. హైటెక్ ముఖ్యమంత్రి అంటూ మూఢనమ్మకాలను ప్రజల పైన రుద్దుతున్నారని ఆరోపించారు. జగన్ కొత్త అబ్బాయ్ కావొచ్చు కానీ ఆయన చెప్పిందే ఇప్పుడు జరుగుతోందన్నారు. విభజన జరిగితే నష్టపోతామని ఆయన చెప్పారని, నాలుగో స్థానంలో ఉన్న ఏపీ 13వ స్థానానికి పడిపోతుందన్నారని, అదే జరిగింది రోజా అన్నారు.
అనుభవమున్న చంద్రబాబుకు రాష్ట్రం విడిపోతే నష్టమని తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి కొత్త కావొచ్చు కానీ ప్రజా సమస్యలకు కొత్త కాదన్నారు. తాము రాజన్న పాలన తెస్తామని ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. చంద్రబాబు టీడీపీతో కాకుండా.. కొత్త పార్టీ పెట్టి గెలవలగలా అని ప్రశ్నించారు. ఆయన కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరన్నారు.
తాము రాజన్న పాలన అంటే టీడీపీ చంద్రన్న పాలన తెస్తానని ప్రచారంలో చెప్పిందా అని ప్రశ్నించారు. మోడీ ఫేస్‌తో, పవన్ కళ్యాణ్ ప్రచారంతో, ఇంటింటికి ఉద్యోగమిస్తామని, లేనిపోని కట్టు కథలతో అధికారంలోకి వచ్చారన్నారు. జగన్ మాత్రం స్పష్టమైన అజెండాతో ఎన్నికలకు వెళ్లారన్నారు. టీడీపీ బాబు పార్టీ కాదని, జెండా కూడా ఆయనది కాదన్నారు.
ఎన్టీఆర్‌ది సమైక్యాంధ్ర పార్టీ అని, విధానాలు కూడా అవి కావన్నారు. మహిళా సాధికారత, రెడు కిలోల బియ్యం, బెల్టు షాపుల రద్దు ఎన్టీఆర్ లక్ష్యాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టి వార్డు మెంబర్‌గా గెలవాలని సవాల్ చేశారు. చంద్రబాబు సొంతూరు చంద్రగిరి, ఎన్టీఆర్ పుట్టిన గుడివాడ నియోజకవర్గాలలో తమ పార్టీ గెలిచిందని, దీనిపై చంద్రబాబు ఆలోచించాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం జగన్ అభ్యర్థులను అక్కడ గెలిపించారన్నారు.
గతంలో నాదెండ్ల మనోహర్, సురేష్ రెడ్డి తదితరులు ఎందరో సభాపతిగా చేశారని, కోడాల మాత్రం టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గోరంట్ల వంటి వారు పదవుల కోసమే.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో ఉన్నారన్నారు. ఎన్టీఆర్ చావుకు డైరెక్ట్‌గా, ఇండైరెక్టుగా చంద్రబాబే కారణమన్నారు. అలాంటి వ్యక్తి తన పైన నిందలు వేస్తే ఎవరు నమ్మరన్నారు. బాబు పైన తాము ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయబోతున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications