ఎదగడం నేర్చుకున్నా: రోజా, టిడిపి ఎమ్మెల్యేకి అస్వస్థత
హైదరాబాద్: రాజకీయంగా ఎలా ఎదగాలో తాను సభాపతి కోడెల శివప్రసాద్‌ను చూసి నేర్చుకున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు రోజా శుక్రవారం అన్నారు. కోడెల సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో అభినందలు తెలుపుతూ ఆమె మాట్లాడారు. గతంలో కోడెలతో పని చేసిన అనుభవం తనకు ఉందన్నారు.
ఉన్నతమైన సభాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కోడెలకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. స్పీకర్‌గా న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు.
టిడిపి సభ్యులతో సమానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను కూడా సభలో మాట్లాడే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ప్రజా సమస్యలపై తాము స్పందించేటప్పుడు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

కోడెల భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తారని పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయనకు అపార అనుభవముందన్నారు. ఏ శాఖ ఇచ్చినా దానికి వన్నె తెచ్చారని కొనియాడారు. గుంటూరు జిల్లాను ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లారన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన నేత కోడెల అని అచ్చెన్నాయుడు అన్నారు.
రామాంజనేయులుకు అస్వస్థత
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టిడిపి భీమిలి ఎమ్మెల్యే రామాంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప ఛాతీ నొప్పితో ఆయన బాధపడ్డారు. స్పీకర్‌గా ఎన్నికైన కోడెలకు శుభాకాంక్షలు తెలిపే సమయంలో ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రామాంజనేయులు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications