లోకేష్‌కు నానమ్మ ఆస్తులు ఎలా ఇచ్చారు, బాబుకు ఫుల్‌స్టాప్ పెట్టా: ఊగిపోయిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు, టిడిపి నేతలు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, సుజనా చౌదరి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్ తదితరుల పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం జరుగిందని, జరుగుతోందని ఆరోపించారు.
రికార్డులు మాయం చేశారేం
రాజధాని భూముల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. సాక్షి పత్రికలో వార్తలు రాగానే.. ఆన్ లైన్లో రికార్డులు అన్నీ తొలగించారని ఆరోపించారు. మరికొందరి పేర్లు బయటకు వస్తాయనే ఆ రికార్డులు తొలగించారన్నారు. తప్పుచేయకుంటే వాటిని ఎందుకు తొలగించారన్నారు. లోకేష్ నిన్న బాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
మేం ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నారని, మరి సిబిఐ విచారణ చేస్తామంటే సోనియా గాంధీ కాళ్లు ఎలా పట్టుకున్నారని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబు ఆస్తుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, దానిపై ఏం చెబుతారన్నారు.

హెరిటేజ్‌లా వేల కోట్లు ఏ రైతు సంపాదించలేదు
చిత్తూరు జిల్లాలో ఏ రైతు కూడా హెరిటేజ్ వంటి వేలాది కోట్ల ఆస్తులకు ఎందుకు ఎదగలేదన్నారు. మదీనాగూడలో, నారావారిపల్లెలో అయిదెకరాల భూమి లోకేష్‌కు వారి నానమ్మ ఇచ్చినట్లు పేర్కొన్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో కూడా ఇల్లు రాసిచ్చినట్లగా ఉందన్నారు.
లోకేష్‌కు నానమ్మ ఆస్తులెలా ఇచ్చారు
లోకేష్ నానమ్మ.. ఆయనకు అన్ని ఆస్తులు ఎలా రాసిచ్చిందో చెప్పాలన్నారు. రెండు ఎకరాల నుంచి అన్ని ఆస్తులు ఎలా ఆవిడ ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు, మంత్రులు, ఇతర టిడిపి నేతల ఆస్తుల పైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు తనకు వాచీ కూడా లేదని చెబుతున్నారని, ఆయన చేతికి వాచీ లేదని, అలాగే రైతులకు మాత్రం గోచీ లేకుండా చేశారన్నారు. నారాయణ, నారా వారు కలిసి రాజధానిలో లక్షల కోట్లు దోచుకుంటున్నారన్నారు. రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా భూసేకరణ ఎలా చేశారని ప్రశ్నించారు.

ఏపీ రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం బయటపడిందన్నారు. రాజధాని ప్రాంతంలో కేవలం టిడిపి నేతల భూములున్న చోటునే కమర్షియల్ జోన్‌గా చేస్తున్నారన్నారు. మంత్రి నారాయణ నిన్న మాట్లాడుతూ.. తాను దోచుకునేందుకు రాలేదని, సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు.
నారాయణకు క్విడ్ ప్రోకో
రాజకీయ అనుభవం లేని నారాయణ.. క్విడ్ ప్రోకో కింద మంత్రి అయ్యారని చెప్పారు. ఎన్నికలకు ముందు టిడిపికి ఖర్చు పెట్టారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్నారని, అక్కడ ఉండే రైతుల కుటుంబాల పిల్లలకు నారాయణ స్కూళ్లలో, కాలేజీల్లో ఉచితంగా సీటు ఇచ్చారా అని ప్రశ్నించారు.
అలాగే, ఎవరికైనా వారి కాలేజీల్లో ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. నారాయణ ఏ రోజు కూడా టిడిపి పార్టీ జెండా మోయలేదన్నారు. నారాయణ కాలేజీ సిబ్బంది మాత్రమే రాజధాని పరిధిలో భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు.
రాజధాని కోసం ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక ఇవ్వాలని చెప్పారని, మరి నారాయణ విద్యా సంస్థల నుంచి ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. వేల ఎకరాలు కొని రైతులను దోచుకున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ బాధ్యతను మంత్రి పత్తిపాటి పుల్లారావు, నారాయణలకు ఎందుకు అప్పగించారో చెప్పాలన్నారు.

జగన్ కాదు.. చంద్రబాబు అహంకారి
జగన్ ప్రవర్తన అహంకారపూరితమని, తన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతుంటే తట్టుకోలేక ఈ విషయాన్ని బయటకు తెచ్చారని టిడిపి నేతలు చెబుతున్నారని, కానీ అహంకారం జగన్‌ది కాదని, చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబు గతంలో చాలా మాట్లాడారన్నారు.
అసెంబ్లీలోనే ఫినిష్ చేస్తానని చెప్పారన్నారు. 1983 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. నా వద్దకు ఎవరైనా రావాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారని, కానీ చంద్రబాబు మాత్రం రాజీనామా చేయించకుండా టిడిపిలో చేర్చుకుంటున్నారన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అబ్బాయి.. తన పీఏ పేరిట భూములు కొన్నారని చెప్పారు. పత్తిపాటి పుల్లారావు ప్రతి కుంభకోణం గురించి ప్రజలకు తెలుసునని చెప్పారు. పత్తిపాటి భార్య వెంకాయమ్మ పేరు మీద అగ్రిగోల్డ్ భూములు బదలాయించుకున్నారన్నారు.
నోరుంది కదా అని జగన్‌ను అనడం కాదని, టిడిపి నేతలు ఇంత పెద్ద మొత్తంలో భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు. మురళీ మోహన్ హైదరాబాదులోని హైటెక్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు భూములు కొంటారని ఎద్దేవా చేశారు. మురళీ మోహన్‌కు చంద్రబాబు చెప్పగానే ఆయన కొంటారన్నారు.
బ్యాంకులకు పంగనామాలు
బ్యాంకులకు పంగనామాలు పెట్టిన సుజనా చౌదరి వంటి వారు కూడా ఎలా కొన్నారన్నారు. సుజనకు కేంద్రమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. నారాయణ, పత్తిపాటి, సుజన వంటి వారు ఎప్పుడూ టిడిపి జెండా మోయలేదని, వారు పార్టీని భ్రష్టు పట్టించే వారన్నారు.
తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఈ రోజు నోరు విప్పాలన్నారు. ఏపీ ప్రజలను, రైతులను సర్వనాశనం చేసి.. తామే కోటీశ్వరులం కావాలని టిడిపి నేతలు అనుకుంటే మేం ఊరుకోమన్నారు. టిడిపి నేతలు నిజాయితీ నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సిబిఐ విచారణ కావాలన్నారు.
తాటాకు చప్పుళ్లకు బెదరం.. బాబుకు ఫుల్ స్టాప్
సాక్షి పైన కేసులు పెడతామంటే, సాక్షి జర్నలిస్టు పైన కేసులు.. ఇక్కడ టిడిపి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేళ్లు ఎవరూ లేరన్నారు. చంద్రబాబు రాష్టడ్రానికి పట్టిన యముడు అని, ఆయనకు ఈ రోజుతో ఫుల్‌స్టాప్ పెట్టామని రోజా అన్నారు.
నిజాయితీగా ఉంటానని, తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు రాజధానిలో జరిగిన అవినీతి బాగోతంపై మాట్లాడాలన్నారు. టిడిపి దళితుల ద్రోహి పార్టీ అన్నారు. టిడిపి నేతలు, వారి పీఏలు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు రాజధాని ప్రాంతంలో భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చాక మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలన్నారు. టిడిపి నేతలు అడ్డంగా బుక్కయ్యారన్నారు. లోకేష్ నానమ్మ పలుచోట్ల కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చేందుకు ఆమె తన రెండు ఎకరాల్లో డబ్బులు పండించిందా లేక బంగారం పండించిందా అన్నారు.












Click it and Unblock the Notifications