భీమవరం కలెక్టరేట్ మారుతుందా? రఘురామ వర్సెస్ మండలి ఛైర్మన్..!
ఏపీలో మరోసారి జిల్లాల పునర్ వ్యవస్ధీకరణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గతంలో జిల్లాల విభజన సందర్భంగా భీమవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు వ్యూహరచనలు జోరుగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో రాజ్యాంగ వ్యవస్థలైన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజుకు మధ్య వివాదం నెలకొంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన సందర్భంగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడిన భీమవరంలో కలెక్టరేట్ ను ఏర్పాటు చేసేందుకు జరిగిన ప్రయత్నాలకు స్ధలాభావం రూపంలో ఇబ్బందులు తప్పలేదు. దీంతో అప్పట్లో ఓ అద్దె భవనాన్ని లీజుకు తీసుకుని అందులోనే ఏర్పాటు చేశారు. అయితే భీమవరంలోని మార్కెట్ యార్డ్ స్ధలంలో ఓ 20 ఎకరాలు కేటాయించడంతో పాటు కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు కూడా ఇచ్చారు.

అయితే కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరిగేలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం, కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ ఈ ప్రతిపాదనను రద్దు చేయడం జరిగిపోయాయి. ఇదే అదనుగా ఉండి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తన స్వగ్రామం పెద అమిరం పంచాయతీని భీమవరంలో కలిపేసి అక్కడే కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ పావులు కదుపుతున్నారు. దీంతో భీమవరానికి చెందిన జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులుతో పాటు జిల్లా వాసి అయిన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాను చెప్పిన చోట కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే స్ధలానికి అయ్యే ఖర్చులో సగం భరిస్తానని, నిర్మాణంలోనూ పాలుపంచుకుంటానని రఘురామ చేస్తున్న ప్రతిపాదనలపై జనసేన ఎమ్మెల్యేతో పాటు మండలి ఛైర్మన్ మోషేను రాజు కూడా మండిపడుతున్నారు.
ఇదే క్రమంలో అసలు రఘురామకు భీమవరానికి సంబంధం ఏంటని ఇవాళ మోషేను రాజు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు.
భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం లేదని రఘురామకృష్ణరాజుకు ఎవరు చెప్పారో సమాధానం చెప్పాలన్నారు.

రఘురామ, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజలను మోసం చేస్తున్నారని మోషేను రాజు ఆరోపించారు గత ప్రభుత్వంలో విడుదల చేసిన 124 జీవో ఇంకా అమలులోనే ఉందని,పెదఅమిరం పంచాయతీ భీమవరంలో ఎందుకు కలుపుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. రఘురామ తన వద్ద ఉందన్న భూమి ఇరిగేషన్ దని, ఈ భూమిలో నిర్మాణాలు జరగాలంటే సుప్రీం అనుమతి కావాలని మోషేను రాజు స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం ముదిరేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications