Rajamouliకి అరుదైన గుర్తింపు: మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ
అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి (Raja Mouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. అక్కడితో ఆగలేదు దీని జైత్రయాత్ర. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకుంది.
ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా లాస్ ఏంజిలిస్ లోని డాల్బీ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అంతకుముందు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది ఈ పాట.

తాజాగా మరో మెట్టు పైకి ఎక్కింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అత్యంత ప్రభావశీల వ్యక్తిగా నిలబెట్టింది. ప్రపంచంలోనే వంద మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళికి చోటు లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్ (Time Magazine) ఈ జాబితాను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వందమంది అత్యంత ప్రభావశీల, శక్తిమంతుల జాబితాను విడుదల చేస్తుంటుందీ మేగజైన్.
ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. కేటగిరీలవారీగా ఈ జాబితాను రూపొందించింది. ఆర్టిస్ట్, ఐకాన్, పయనీర్స్, వరల్డ్ లీడర్స్, టైటాన్స్, ఇన్నోవేటర్స్ కేటగిరీల్లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల పేర్లను చేర్చింది టైమ్ మేగజైన్. ఇందులో పయనీర్స్ కేటగిరీలో ఎస్ఎస్ రాజమౌళికి చోటు లభించింది. బాలీవుడ్ నటి ఆలియా భట్ చేసిన కామెంట్స్‌ను ఇందులో పొందుపర్చింది.
ఇదే జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, టెలివిజన్ ప్రజెంటర్ పద్మా లక్ష్మీ ఉన్నారు. భారత్ నుంచి ఎంపికైన సెలెబ్రిటీల్లో ఈ నలుగురికి మాత్రమే చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడా, ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్, సాకర్ స్టార్ లియొనెల్ మెస్సీ తదితరులు ఉన్నారు.
కాగా- అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఎస్ ఎస్ రాజమౌళికి స్థానం దక్కడం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఆయన మహేష్ బాబుతో సినిమా తీయనున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా ఇది తెరకెక్కబోతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కింద కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇదొక ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అడ్వెంచర్ మూవీ. కొన్ని ఆఫ్రికన్ దేశాలు, అమెజాన్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఆంజనేయుడి స్ఫూర్తితో మహేష్ బాబు పాత్రను రాజమౌళి డిజైన్ చేశారనే వార్తలొస్తోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళికి టైమ్స్ మేగజైన్ లిస్టులో చోటు దక్కడం పట్ల మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తోన్నారు. రాజమౌళికి బెస్ట్ విషెస్ తెలియజేస్తోన్నారు.












Click it and Unblock the Notifications