అమరావతి తీర్పు-హైకోర్టు హద్దుమీరిందన్న సాయిరెడ్డి-ఆధారాలు ఇమ్మన్న రాజ్యసభ ఛైర్మన్..
ఏపీ అసెంబ్లీ ఆమోదించిన 3 రాజధానుల్ని కాదని అమరావతినే రాజధానిగా ప్రకటించిన హైకోర్టు తన పరిధి అతిక్రమించిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ ఆధారాలు కోరారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యవహారం రాజ్యసభలోనూ రచ్చకు కారణమైంది. అసెంబ్లీ నిర్ణయాన్ని కాదని హైకోర్టు అమరావతినే రాజధానిగా ప్రకటించడం హద్దు మీరడమేనంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్కడ్ అలా హద్దుమీరిందని మీరు చేస్తున్న వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించాలని కోరారు.

అమరావతిపై హైకోర్టు తీర్పు
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేలా వైసీపీ సర్కార్ రెండు బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించింది. ఆ తర్వాత మండలి వద్దన్నా గవర్నర్ సాయంతో ఈ బిల్లులకు ఆమోదముద్ర వేయించుకుంది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు.. సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. చివరిగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది.

రాజ్యసభలో లేవనెత్తిన సాయిరెడ్డి
అయితే హైకోర్టు అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఇచ్చిన తీర్పు వ్యవహారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందులో కేంద్రం, కోర్టులు చొరబడటానికి వీల్లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు అందరికీ అందించేందుకు మూడు రాజధానుల్ని తీసుకొచ్చిందని, కానీ కోర్టుల వల్ల వాటి ఫలాలు ప్రజలకు అందకుండా పోతున్నాయని రాజ్యసభలో వెల్లడించారు.

హైకోర్టు హద్దుమీరిందన్న సాయిరెడ్డి
ఈ క్రమంలో విజయసాయిరెడ్డి హైకోర్టు హద్దు మీరిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అధికారాల్ని కాదని హైకోర్టు తన అధికారం వాడి అమరావతినే రాజధానిగా నిర్ణయించిందన్నారు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అలాగే రాజధాని నిర్ణయాధికారం పూర్తిగా కార్యనిర్వహణాధికారమని, కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని అంశమేనని సాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సాయిరెడ్డి వాదించారు. అయితే న్యాయవ్యవస్ధ గురించి మాట్లాడుతూ సాయిరెడ్డి వాడిన జ్యుడిషియల్ ఔట్ రీచ్ అన్న పదంపై రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్కడ్ అభ్యంతరం తెలిపారు.

సాయిరెడ్డిని ఆధారాలు కోరిన రాజ్యసభ ఛైర్మన్
అసెంబ్లీ అధికారాల్ని న్యాయవ్యవస్ధ హద్దుమీరి తీసుకుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో విజయసాయిరెడ్డి జ్యుడిషియల్ అవుట్ రీచ్ అన్న పదం వాడారు. దీని అర్ధం ఆక్రమణ. అంటే హైకోర్టు అసెంబ్లీ అధికారాన్ని ఆక్రమించుకుని అమరావతే రాజధాని అనే తీర్పు ఇచ్చిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్..న్యాయవ్యవస్ధపై మీ వ్యాఖ్యలు సమర్ధించుకునే అధారాలు సమర్పించాలని కోరారు. న్యాయవ్యవస్ధ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. తాను జాగ్రత్తగానే మాట్లాడుతున్నానని సాయిరెడ్డి చెప్పగా.. అయితే దాన్ని ధృవీకరించాలని సూచించారు. న్యాయవ్యవస్ధ తన పరిధి మించి వ్యవహరించిందని అనడం అంటే కళకం ఆపాదించడమేనన్నారు. కాబట్టి దానికి ఆధారాలు సమర్పించాలని సూచించారు.

సాయిరెడ్డి మరో వివరణ !
అయితే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. కోర్టు ఇచ్చిన ఏ తీర్పు ఆధారంగా మీరు ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని రాజ్యసభ ఛైర్మన్ సాయిరెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ధిక్కరణ అవుతుందన్నారు. కానీ రాజ్యసభ ఛైర్మన్ వదల్లేదు. మీ వ్యాఖ్యలకు ఆధారాలతో డాక్యుమెంట్లు సభ ముందుంచాలన్నారు. దానిపై సాయిరెడ్డి ఏదో వివరణ ఇవ్వబోగా.. ముందు డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. మళ్లీ సాయిరెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్ధించుకునే ప్రయత్నం చేసినా సభ ముందు డాక్యుమెంట్లు సమర్పించాకే మాట్లాడాలన్నారు. దీంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా ముగిసింది.












Click it and Unblock the Notifications