ఆర్టీసి బస్సు బోల్తా: పెద్ద శబ్దం, భీతిల్లిన జనం, డ్రైవర్ తెలివితో.. (ఫొటోలు)
విశాఖపట్నంలోని జాతీయ రహదారిపై పోర్టు ఆస్పత్రి వద్ద సోమవారం మధ్యాహ్నం ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయబ్రాంతాలకు లోనయ్యారు. బస్సు బోల్తా పడిన సమయంలో పెద్ద శబ్దం వచ్చింది.
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జాతీయ రహదారిపై పోర్టు ఆస్పత్రి వద్ద సోమవారం మధ్యాహ్నం ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయబ్రాంతాలకు లోనయ్యారు. బస్సు బోల్తా పడిన సమయంలో పెద్ద శబ్దం వచ్చింది.
అయితే, ప్రయాణికులెవరూ మరణించకపోవడం ఊరట. సంఘటనా స్థలం వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఆటోను తప్పించబోయి బస్సు డివైడర్‌కు ఢీకొని బోల్తాపడింది. నర్సీటపట్నం డిపోకు చెందిన ఏపీ 28జెడ్ 5456 నెంబరు గల ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 15 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
పోర్టు ఆసుపత్రి కూడలి వద్దకు వచ్చిన సమయంలో బస్సు ముందు వెళ్తున్న ఆటోను డ్రైవర్ అకస్మాత్తుగా కుడి వైపునకు తిప్పాడు. దీంతో వెనుక ఉన్న బస్సు డ్రైవర్ ఆటోను తప్పించేందుకు ఒక్కసారిగా ఎయిర్ బ్రేక్‌ను మూడు సార్లు నొక్కాడు.

బస్సు అదుపులోకి రాక...
వేగం కారణంగా బస్సు అదుపు కాలేదు. దీంతో డివైడర్‌ను ఢీకొని రహదారిపై బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదురై కింద పడిపోయారు. లోపల ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. బోల్తా పడిన సమయంలో అక్కడున్న వారంతా ప్రయాణికుల్ని బయటకు తీసుకురావడానికి సహాయం అందించారు.

ఇద్దరికి గాయాలు..
బస్సు ప్రమాదంలో నర్సీపట్నం దరి మాకవరపాలెం ప్రాంతం పైడిపాలెం గ్రామానికి చెందిన బత్తుల రాఘవమ్మ(65)కు నుదుటిపై గాయమైంది. కల్యాణి అనే మహిళ కాలికి తీవ్ర గాయమైంది. తొలుత ఆమెను పోర్టు ఆసుపత్రికి తరలించగా కాలు విరిగిందని చెప్పడంతో కేజీహెచ్‌లో చేర్చారు. వృద్ధురాలిని అక్కయ్యపాలెంలోని పద్మజ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

బస్సు అద్దాలు ధ్వంసం
ఆర్టీి బస్సు ముందు, వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ ఈడీ రామకృష్ణ, ఆర్‌ఎంవో సుధీశ్‌కుమార్, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన వివరాల్ని డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. బస్సుకు సుమారు 15 వేల వరకు నష్టం జరిగిందన్నారు. నాల్గవ పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు
Recommended Video


స్తంభించిన ట్రాఫిక్...
బస్సు జాతీయ రహదారికి అడ్డంగా బస్సు బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓ వైపు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్, మరో వైపు తాటిచెట్లపాలెం కూడళ్ల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బస్సును తరలించేంత వరకు ఒక వైపు మార్గంలో వాహనాలను మళ్లించారు. ట్రాఫిక్‌ని దారిలో పెట్టడానికి పోలీసులకు దాదాపు గంట సమయం పట్టింది. క్రేన్ సహాయంతో బస్సును పక్కకి నిలబెట్టడంతో ట్రాఫిక్ సమస్య తీరింది.

మరో ప్రమాదం...
రహదారిపై పూర్తిస్థాయిలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు పెద్ద యెత్తున నిలిచిపోయాయి. కొద్దిసేపటి తర్వాత ఒక్కేసారి వాహనాలు కదలడంతో తాటిచెట్లపాలెం నుంచి వస్తున్న మారుతీ కారును, అటుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. కారు తాలుకా డోరు ట్యాంకర్ ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో కొంత ముందుకు తీసుకుని వెళ్లిపోయాడు. అయితే పక్కన ట్రాఫిక్ నియంత్రిస్తున్న పోలీసులు కారును తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఆర్టీసి బస్సు ఇలా
సోమవారం మధ్యాహ్నం ఆర్టీసి పన్నెండున్నర గంటలకు ద్వారకా ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి 15 మంది ప్రయాణికులతో బయలుదేరింది. తన తల్లికి కంటి చూపు మందగించడంతో ఆస్పత్రికి తీసుకుని వచ్చామని, తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగిందని, దేవుడే తమను రక్షించాడని బత్తుల రాఘవమ్మ కూతురు సీత అన్నది.

కండక్టర్ చేతికి గాయం...
కండక్టర్ ధనలక్ష్మి చేతికి గాయమైంది. దీంతో ఆమెను ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. బస్సు ఇంజన్ నుంచి ఆయిల్ లీకయింది. దీంతో స్థానికులు ట్రాఫిక్ పోలీసులు ఇసుక తీసుకుని వచ్చిన రోడ్డుపై పోశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అదుపులోకి ఆర్టీసి డ్రైవర్...
ఆర్టీసి డ్రైవర్ పి.జె. రాజును నాలుగో పట్టణం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన పోర్టు ఆస్పత్రి జంక్షన్‌లో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications