జయసుధ సీటుపై కార్తీక కన్ను,ఐనా: ముషీరాబాద్ హాట్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు కాంగ్రెసు పార్టీ నుండి అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా 2009లో ఆ పార్టీ గెలిచిన ముషీరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ముషీరాబాద్ లేదంటే సికింద్రాబాదు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.
నగరంలో ఏదైనా ఓ అసెంబ్లీ లేదా లోకసభ స్థానం కేటాయిస్తే పోటీకి ఆమె సిద్ధమంటున్నారు. సికింద్రాబాదు నుండి ప్రస్తుతం జయసుధ, ముషీరాబాద్ నుండి మణెమ్మలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జయసుధ మళ్లీ సికింద్రాబాదు నుండి పోటీ చేసే అవకాశమున్నప్పటికీ.. మణెమ్మ మాత్రం తన తనయుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ముషీరాబాద్ నుండి టిక్కెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

బండారు కార్తీక రెడ్డి, ఎపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబిడ్ రసూల్ ఖాన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ముషీరాబాద్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఉంటుంది. అయితే, మణెమ్మ ఈసారి తన తనయుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. దీంతో మిగిలిన ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో లేకుంటే ఎవరికైనా అవకాశం ఉంటుందంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీకి క్యూలో ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి కూడా తన స్థానంలో తన సోదరుడికి టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే విరమించుకుంటే తమకు అవకాశం ఉంటుందని నగర నేతలు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారు.
జయసుధ ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాదు నియోజకవర్గం నుండి పోటీకి బండారు కార్తీక రెడ్డి, కాంగ్రెసు కార్పోరేటర్ ఉమాదేవి తదితరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, జయసుధకే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, ముషీరాబాదులతో పాటు అంబరుపేట, కూకట్ పల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. అంబరుపేట విహెచ్‌కు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications