వైసీపీ లేటెస్ట్ ఓట్ షేర్ ఇదీ, గెలుపు పక్కా - సజ్జల క్లారిటీ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పొత్తులపైన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పందించారు. పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీతో అంతర్గతంగా ఏం జరుగుతుందనేది వివరించారు. వచ్చే ఎన్నికల్లో అసలు వ్యతిరేక ఓటు ఉంటేనే కదా..ప్రతిపక్షాలు చీలకుండా చూసేది అంటూ చెప్పుకొచ్చిన సజ్జల..వైసీపీ బలం ఏంటో స్పష్టం చేసారు.
వంగి వంగి..నంగి నంగి : టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. ఢిల్లీలో బీజేపీ నేతల ప్రాపకం కోసం వారి గేట్ల వద్ద చంద్రబాబు వెయిట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నడ్డా వద్ద వంగి వంగి..నంగి నంగి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నా..వారి నుంచి స్పందన లేదన్నారు.

దీంతోనే పవన్ కల్యాణ్, పురందేశ్వరితో ప్రయత్నాలు చేస్తున్నారని..అదే చంద్రబాబు అంతర్గతంగా చేస్తున్న ప్రయత్నాలుగా సజ్జల పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీలో చంద్రబాబు ఏజెంట్ గా పని చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా..తామకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.
వైసీపీకి 70 శాతం పాజిటివ్ ఓట్ : ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక గురించి ప్రతిపక్షాలు మాట్లాడటంపై సజ్జల కీలక విశ్లేషణ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా పాజటివ్ ఓటింగ్ పైనే నమ్మకంతో ఉన్నారని సజ్జల వెల్లడించారు. ప్రస్తుతం 70 శాతం మేర పాజిటివ్ ఓటింగ్ ఉందని, కొంత తగ్గినా 60 శాతం వైసీపీకి పాజిటివ్ ఓటింగ్ ఉందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు మిగిలిన ఓటింగ్ శాతంలో చీలిక లేకుండా చేసినా.. కలిసి పోటీ చేసినా ప్రభావం ఉండదని సజ్జల తేల్చి చెప్పారు. అసలు టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదని, అటువంటి పార్టీ వైసీపీ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేసారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రజలు టీడీపీకి బ్రహ్మరధం పడితే పొత్తులు ఎందుకని సజ్జల ప్రశ్నించారు.

టీడీపీకి ఆ ధైర్యం లేదు : రాష్ట్రపతి భవన్ లో చంద్రబాబు అండ్ కో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంగా మలచుకున్నారని సజ్జల పేర్కొన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి అవకాశం ఇవ్వకపోవటం సరి కాదన్నారు. 1994లో ఎన్టీఆర్ అందరి సమక్షంలోనే లక్ష్మీ పార్వతి తన సతీమణిగా పరిచయం చేసారని గుర్తు చేసారు.
ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ తరపున ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీపార్వతి ప్రచారం చేసారని సజ్జల చెప్పుకొచ్చారు. అసలు లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ తో సంబంధం లేదని చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు. లోకేశ్ యాత్రకు కార్యకర్తలే రావటం తేదన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం టీడీపీకి లేదని సజ్జల పేర్కొన్నారు. ఎవరు పొత్తులతో వచ్చినా..ప్రజలు తమతోనే ఉన్నారని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications