అమరావతి పై కేంద్రం తేల్చిందిదే - రాజధాని పై సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
అమరావతి రాజధాని పైన కేంద్రం ఏం తేల్చిందో సజ్జల క్లారిటీ ఇచ్చారు. రాజధాని గురించి స్పష్టత ఇచ్చారు.
అమరావతి రాజధాని వ్యవహారం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న మూడు రాజధానుల కేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ మొదలు..అమరావతి రాజధానిగా నోటి ఫై చేసిన అంశం వరకు ప్రస్తావించారు. దీంతో..అమరావతే రాజధాని గా కేంద్రం క్లారిటీ ఇచ్చిందంటూ ప్రచారం జరిగింది. దీని పైన సజ్జల స్పష్టత ఇచ్చారు. నాడు జగన్ ఏం చెప్పారో గుర్తు చేసారు.

కేంద్ర అఫిడవిట్ లో స్పష్టత
రాజధాని విషయంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ స్పష్టంగానే ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. అమరావతే ఏకైక రాజధాని అని అందులో ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. టీడీపీ మద్దతు మీడియా హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు కూడా మాట్లాడటం సరికాదన్నారు. అమరావతిలో భూములపై చంద్రబాబు కన్నేసారని ఆరోపించారు. తన కోటరీకి మళ్ళీ ఆశలు కల్పించేలా బాబు మాటలు ఉన్నాయని ధ్వజమెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ వేసిన రిపోర్టులో ఉన్నట్టు చంద్రబాబు పని చేశారా అని ప్రశ్నించారు. వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ చెప్పారని గుర్తు చేసారు. కానీ, ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టి..నారాయణ కమిటీ వేసి అమరావతిని ఎంపిక చేసారని వివరించారు.

ఆ కమిటీని చంద్రబాబు అమలు చేయలేదు
మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణ చెప్పారని సజ్జల వెల్లడించారు. కానీ చట్టానికి విరుద్దంగా అమరావతిని ఎంపిక చేసారని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న అయిదేళ్లలో అక్కడ ఏం కట్టారని నిలదీసారు. తాత్కాలిక భవనాల కోసం 600 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అమరావతిలో నిజమైన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందన్నారు. రోడ్ల నిర్మాణం, నది పై బ్రిడ్జిలు మేము కడుతున్నామని వివరించారు. అమరావతి డిక్లేర్ చేసాక చంద్రబాబును కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. అసెంబ్లీలో తాము మాట్లాడిన మొత్తం వీడియోను చూపకుండా కట్ చేసి చూపించారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని ఉండాలని జగన్ ఆనాడు చెప్పారని గుర్తు చేసారు.

ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగింది
గతంలో ఇజ్రాయిల్ నుండి ట్యాపింగ్ పరికరాలు తెచ్చి తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని సజ్జల ఆరోపించారు. తాము మేము ఆధారాలతో సహా బయట పెట్టామని చెప్పారు. ముందస్తు ఎన్నికలంటూ భ్రమల్లో ఉంటున్నారని ఫైర్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర లో కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి విషయంలో చంద్రబాబు లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో చంద్రబాబు బినామీ పేర్లతో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసారని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా మార్చుకున్నారని సజ్జల విమర్శించారు.












Click it and Unblock the Notifications