జగన్‌ను రాయితో కొట్టాలంటూ టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు పిలుపు: సాక్ష్యం ఇదే
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ ఉదంతం నేపథ్యంలో నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చారు జగన్. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్‌లో విశ్రాంతి తీసుకుంటోన్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటన జగన్ గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది.

రాత్రి విరామ సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. గాయానికి కుట్లు వేశారు. మూడు కుట్లు వేశారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించడంతో నేటి బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
జగన్‌పై దాడి వెనుక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వారిద్దరి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని విమర్శించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడారు. జగన్‌ను రాయి తీసుకుని కొట్టాలంటూ రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. టీడీపీ నాయకులు కన్నెర్ర చేస్తే వైఎస్ జగన్ మసైపోతాడంటూ ప్రోత్సహించడం ఇందులో కనిపించింది. అలా జగన్‌పై దాడి చేసిన వారికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు.
జగన్‌పై జరిగిన ఈ దాడి ఆకతాయిల పని కాదని, పక్కా ప్లాన్‌తో దీన్ని అమలు చేశారని సజ్జల ఆరోపించారు. కొంచెం కిందికి తగిలి ఉంటే కన్ను పోయేదని, ఇంకొంచె ఎడమవైపున కణతకు తగిలివుంటే ప్రాణం ఉండేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో రాయి దొరకలేదని తెలిపారు.

చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగలదని, ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్టు అనుమానిస్తోన్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో జగన్ గాయాలతో బయటపడ్డాడంటే అది కేవలం ఆయన అదృష్టమేనని సజ్జల వ్యాఖ్యానించారు. ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలతోనే జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.
ఈ ఘటనను చంద్రబాబు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా భద్రతా వైఫల్యం అని చెబుతోందని, టీడీపీ నాయకులు నటన అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. నుదుటి మీద గాయం అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అది నటన అంటూ ఎవరైనా మాట్లాడతారా? అని పేర్కొన్నారు. ఈ దాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించారు.
సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రల వల్ల రాజకీయంగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్లే ఈ దాడికి పాల్పడి ఉంటారనేది ఎవరిని అడిగినా చెబుతారని సజ్జల చెప్పారు. బస్సు యాత్ర విజయవంతం అవుతోందని, జగన్‌ను బయటికి రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే దాడికి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications