జగన్ సీఎం కాకుండా ఆపడం అప్పుడు మాత్రమే సాధ్యం - సజ్జల..!!
జనసేన అధినేత వపన్ కల్యాణ్ వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానంటూ ప్రకటించారు. దీని పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసారు. పవన్ తాను ఏం చేస్తానో కూడా చెప్పలేకపోతున్నారని, చంద్రబాబు ఏజెంట్‌గా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి అధికారం ఇవ్వాలన్నది జనమే నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు.అధికారం ఎవరికి ఇవ్వాలనేది తేల్చేది పవన్ కళ్యాణ్ కాదన్నారు.అపరిపక్వత, మూర్ఖత్వం, అఙానంతో పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

జగన్ ను ఆపడం అప్పుడు సాధ్యం అవుతుంది
చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలని సజ్జల డిమాండ్ చేసారు. పవన్ ఎవరి తరపున మాట్లాడుతన్నారో స్పష్టం అవుతుందని వ్యాక్యానించారు. టీడీపీ - చంద్రబాబును పవన్ ఒక్క మాట కూడా అనటం లేదన్నారు. సినిమా అభిమానంతో చప్పట్లు కొట్టించుకొనేందకు పవన్ ఏదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పవన్ అంటున్నారని.. లక్షా 30వే సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చిన విషయం పవన్ తెలుసుకోవాలని సూచించారు. ఏజెంటు...చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారని ఎద్దేవా చేసారు. సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటే మాత్రమే జగన్ సీఎం కాకుండా ఆపడం సాధ్యమవుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్ - చంద్రబాబు కాదన్నారు. లబ్దిదారులైన రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటే అప్పుడు జగన్ అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారంటూ చెప్పుకొచ్చారు.

పాల్ రావచ్చు - పవన్ కళ్యాణ్ రావచ్చు
సీఎం జగన్ కూడా తాను చేసిన సేవ బాగుంటేనే ఓట్ వేయమని అడుగుతున్నారని గుర్తు చేసారు. అవినీతికి హాలిడే ఇచ్చారని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పంచ్ డైలాగులుగా చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాల్ రావచ్చు, పవన్ రావచ్చు..పోటీ చేయవచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు. పిన్నెల్లి ఆరోజు సీఎంవో లోనే ఉన్నారు..గడప గడప కు కార్యక్రమంలో ఉన్నారని సజ్జల వివరించారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని చెప్పారు. పార్టీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలం తీసుకుంటే అవసరమైతే ఆర్టీసికి పరిహారం ఇవ్వవచ్చా అనేది చూస్తామన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పిన సజ్జల..పెండింగ్ లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు. పవన్ సీరియస్ పొలిటిషియన్ అయితే రాష్ట్రం గురించి ఆలోచన చేయాలని సూచించారు. తాను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని ప్రజలకు చెప్పాలని హితవు పలికారు. పవన్ ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒకసారి కులం అంటారు, మరోసారి కులం అవసరం లేదంటారని వివరించారు. ఇంకోసారి బీజేపీ రోడ్డు మ్యాప్ అంటారని. టీడీపీని మాత్రం ఒక్క మాట కూడా అనటం లేదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు పదవులు, పనుల్లో 50 శాతం పైగా అమలు చేసి చూపారన్నారు. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచన ఉంటే చెప్పాలని సజ్జల డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications