అటాకింగ్ గ్యాంగ్- వారి చేతిలో చంద్రబాబు కూడా పావులాంటోడే
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం సంతకం చేయాల్సి ఉంటుందని షరతు విధించింది.
దీనిపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఒక కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ రావడం అనేది సాధారణంగా జరుగుతున్నప్పటికీ- వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఒక వర్గానికి చెందిన మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా, వాళ్లే సొంతంగా దర్యాప్తు జరపడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే సత్తా లేని చంద్రబాబుకు ఒక అస్త్రాన్ని అందించేలా కథనాలు రాశాయని ధ్వజమెత్తారు.
మీడియా తన పరిధులు దాటిందంటూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా తన తీర్పులో పొందుపరిచడం దాని తీవ్రతను తెలియజేస్తోందని సజ్జల అన్నారు. జడ్జిని కూడా దురుద్దేశాలు అపాదించేలా మాట్లాడరని చెప్పారు. మీడియా పేరుతో వారంతా కలిసి టీడీపీ మూకలాగా అటాకర్స్ గ్యాంగ్ లాగా తయారయ్యారని విమర్శించారు. ఒక దశలో జడ్జి ఈ కేసు నుంచి తప్పుకోవాలనుకునేంతటి ఒత్తిడిని తీసుకొచ్చారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి రాజకీయ అజెండాను ఈ అటాకర్స్ గ్యాంగ్ డిసైడ్ చేస్తోందని సజ్జల ఆరోపించారు. సోకాల్డ్ మీడియా గ్యాంగ్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందనేది తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసిందని, ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. మీడియా తన పరిధులను దాటిందనే విషయం ప్రజలకు తెలిసిన విషయమేనని పేర్కొన్నారు.
చంద్రబాబు కూడా ఆ గ్యాంగ్ చేతిలో పావులాంటివాడేననేది అర్థమౌతోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన, అజెండా తెలుగుదేశం పార్టీకి ఎలాగూ లేకుండాపోయిందని, ఈ మీడియా గ్యాంగ్ చెబుతున్నదే పాటిస్తోన్నాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియా రాజకీయ అజెండా సెట్ చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక వ్యక్తిత్వ హననానికి పూనుకుంటోన్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications