36 గంటల డ్రామా: ఏం మెసేజ్ ఇచ్చారంటూ చంద్రబాబు దీక్షపై సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ దీక్ష ద్వారా ప్రజలకు ఆయన ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష దేనికో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు సజ్జల.

36 గంటల డ్రామా.. బూతులు సమర్థిస్తూ దీక్షలా..?: సజ్జల
36 గంటల దీక్ష ఎందుకో టీడీపీ నేతలకే తెలియదంటూ సజ్జల విమర్శించారు. దీక్ష పేరుతో డ్రామాలు ఆడారంటూ సజ్జల విమర్శించారు. దీక్షలో ఎలా పడుతూ అలా మాట్లాడుతున్నారని.. చూసుకుందాం, కొడతాం అంటూ బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. చేసేది దీక్ష.. మాట్లాడేది బూతులు అంటూ సజ్జల చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బూతులను సమర్థిస్తూ దీక్షలు చేస్తారా? అంటూ సజ్జల ప్రశ్నించారు.

72ఏళ్ల చంద్రబాబు అరలీటర్ నీటితో 36 గంటలపాటు ఎలా?
36 గంటలపాటు నిరాహార దీక్ష చేసిన 72 ఏళ్ల వ్యక్తి గంటకుపైగా ఆవేశంతో ఎలా మాట్లాడగలిగారని సజ్జల ప్రశ్నించారు. అరలీటర్ నీటితో 36 గంటలు కూర్చోవడం సాధ్యమేనా అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ప్రజలకు సంబంధించి ఒక్క అంశంపైనా చర్చించలేదన్నారు. పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తూ దానిపై ఓ ఉద్యమం నడిపేందుకు శ్రీకారం చుట్టడంలో బాగంగానే చంద్రబాబు దీక్షకు కూర్చున్నట్లుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఇలానే మాట్లాడతారా?
పట్టాభితో చంద్రబాబు తిట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గాంధేయవాదం పేరుతో చంద్రబాబు బూతులు మాట్లాడారని మండిపడ్డారు. పట్టాభి బూతులు ఏం మాట్లాడో తెలియదని చంద్రబాబు పేర్కొన్నారని.. పట్టాభితో ఆ మాట అనిపించిందే చంద్రబాబు అని సజ్జల పేర్కొన్నారు. ఇలానే ఉంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని అన్నారు. ఢిల్లీకి వెళ్లి ఇలానే మాట్లాడుతారా? అంటూ సజ్జల చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ఢిల్లీలో ఇదే పదంతో పలకరించగలరా? అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలోనే గంజాయి దందా జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు సజ్జల. అక్రమ మద్యాన్ని నివారించేందుకు ఎస్ఈబీని నియమించామని తెలిపారు.
Recommended Video

చంద్రబాబు దీక్షల చందాల వసూళ్లు: సజ్జల
రాష్ట్రంలో హింసకు పురిగోల్పుతుందే చంద్రబాబు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతా చేసి అన్యాయం జరిగిందనడం సిగ్గుచేటని సజ్జల విమర్శించారు. రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తొందరగా అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారని.. ఇదంతా నాటకమని పేర్కొన్నారు. చంద్రబాబు దీక్షలో చందాలు వసూలు చేశారని.. ఇదేమైనా ప్లీనరీనా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కాగా, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, అరెస్ట్, టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు నాయుడు 36 గంటలపాటు దీక్షలో కూర్చున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయన దీక్షను ముగించారు.












Click it and Unblock the Notifications