అమరావతిలో వైఎస్ జగన్..
YS Jagan and YS Bharathi: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి. హైదరాబాదీయులు ఏపీ వైపు పరుగులు తీశారు. ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సందడి కనిపించింది. క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించి.. సంక్రాంతి పండుగను ప్రారంభించారు.

తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. ముగ్గులతో సర్వాంగ సుందరంగా మార్చారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా వైఎస్ జగన్ దంపతులు.. రైతులు, పల్లె ప్రజలతో కలిసి భోగి వేడుకలను జరుపుకొన్నారు.
తొలుత వైఎస్ జగన్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేశారు. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఉన్న గోశాలల గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సాంస్కృతిక, కళా ప్రదర్శనలను ఇచ్చారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని గోశాల వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు
— YSR Congress Party (@YSRCParty) January 14, 2024
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ దంపతులు.#HappyBhogi#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/ouX62timNC
విప్, చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా జగన్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబరం అంత సంబరంగా జరుపుకొనే పెద్ద పండుగగా అభివర్ణించారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేయాలని పిలుపునిచ్చారు.
సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని, సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు.












Click it and Unblock the Notifications