నిషేధం ఉన్నా కోడి పందేలకు రెడీ: టెక్కీలు సైతం...
విజయవాడ: కోడి పందేలపై నిషేధం ఉంది. కోర్టులు వాటిని నిషేధించాయి. అయినా వాటి నిర్వహణకు ఉత్తరాంధ్రలో ఏర్పాట్లు పెద్ద యెత్తున జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పెద్ద యెత్తున కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గెలుపు పుంజులపై అప్పుడే బెట్టింగులు కూడా ప్రారంభమయ్యాయి. కొంత మంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఈ పందేల నిర్వహణలో ఉండడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దాంతో నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సాధారణంగా కోడి పందేలు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా కోడి పందేలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో నూతన సంవత్సరం వేడుకలతోనే ప్రారంభమవుతాయి.

ఇది సంప్రదాయ క్రీడ...
కోడి పందేలు దసరా, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే క్రీడలను నిర్వాహకులు అంటున్నారు. ఉత్తరాంధ్రలో నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు మొదలు పెట్ట నెల మొత్తం నిర్వహిస్తారు.

టెక్కీలు సైతం ఇలా
నిరుడు టెక్కీలతో పాటు ప్రతి ఒక్కరూ కోడి పందేల్లో పాల్గొన్నారని, బెట్టింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని అంటున్నారు. కోర్టుల నిషేధం ఉన్నప్పటికీ, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పంటర్స్ కోడి పుంజులను ఆంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి, ఒడిశా నుంచి తెప్పించుకుంటున్నారు.

వేలల్లో కోడి పుంజుల ధరలు...
పందేల్లో పాల్గొనే సాధారణ కోడి పుంజుల ధరలు 4 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు ఉంటాయి. ఉత్తమ జాతికి చెందిన కోడి పుంజుల ధరలు 15 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు పలుకుతాయి.

పచ్చకాకిదే పైచేయి...
కోడిపుంజుల్లో చాలా జాతులున్నాయి. అయితే పచ్చకాక, కాకినెమలి జాతి కోడిపుంజులకు ధరలు ఎక్కువ. విజయం సాధించడంలో అవి దూకుడుగా వ్యవహరిస్తాయని భావిస్తార. జాతి బట్టే కోడి పుంజుల ధరలు ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు ఏ మాత్రం ప్రభావం చూపబోదని కూడా అంటున్నారు.

టీడిపి నేతలు పాలు పంచుకున్నారు.
విశాఖపట్నంలో 2016లో అరివోల, ముదసర్లోవా, భిమిలీ, తగరపువలస, ఆనందపురం, వెంకోజీపాలెం వంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కోడి పందేల పోటీలకు ప్రారంభోత్సవాలు చేశారు.












Click it and Unblock the Notifications