చంద్రబాబుకు బిగ్ షాక్: సుప్రీంకోర్టులో మరోసారి..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

అరెస్టయినప్పటి నుంచి చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటీషన్లపై పోరాటం చేస్తోన్నారు. తనపై ఏపీ సీఐడీ అధికారులు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అక్రమం అని, దాన్ని కొట్టివేయాలనేది చంద్రబాబు వాదన. ఆ ఉద్దేశంతోనే ఆయన క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. మొదట ఏపీ హైకోర్టు దీన్ని డిస్మిస్ చేయగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ ఉదయం విచారణ మొదలైంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వొకేట్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపించారు.
ఈ క్వాష్ పిటీషన్‌పై సోమవారమే వాదనలు ఆరంభం అయ్యాయి. ఇవ్వాళ కూడా కొనసాగాయి. నిజానికి- మధ్యాహ్న భోజనం విరామానికి ముందే తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా తమ ధర్మాసనానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్టయి నెల రోజులు దాటిపోయిందని, నేడే తుది నిర్ణయం తీసుకోవాలని వారు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనితో భోజన విరామం అనంతరం వాయిదా పడింది ఈ పిటీషన్‌పై విచారణ. విరామం అనంతరం విచారణ పునఃప్రారంభమైంది గానీ ఎక్కువసేపు కొనసాగలేదు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది ధర్మాసనం.
మరోవంక- ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు సోమవారమే కొట్టేసిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ డిస్మిస్ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ మార్పు, అంగళ్లు వద్ద పోలీసులపై దాడికి పాల్పడటం, వారిని గాయపర్చడం, వాహనాలను తగులబెట్టడం..ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ముందస్తు బెయిల్ దక్కలేదు చంద్రబాబుకు.












Click it and Unblock the Notifications