కోన వెంకట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు: ఎందుకంటే?
బాపట్ల: ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కూడా అయిన కోన వెంకట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణలతో బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఆయనపై కేసు నమోదైంది. కాగా, కోన వెంకట్ బాబాయి రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ బరిలో దిగారు. ఈ క్రమంలో, బాపట్లలో ఒక మండలానికి వైసీపీ ఇంఛార్జీగా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.
అయితే, బాపట్ల మండలానికి చెందిన దళిత నేత కత్తి రాజేష్ వైసీపీకి రాజీనామా చేసి శనివారం తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో రాజేష్ తమ వద్ద రూ. 8 లక్షల అప్పు తీసుకున్నాడంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో ఎస్ఐ ఛాంబర్‌లో వైసీపీ నాయకులతో కలిసి కోన వెంకట్, ఎస్ఐ తనపై దాడి చేశారని, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాననే అక్కసుతో తనపై దాడికి పాల్పడ్డారని రాజేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నరేంద్ర వర్మ, అన్నం సతీష్, గోవర్ధన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలో కలిసి గణవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
రాజేష్ ఫిర్యాదుతో కోన వెంకట్ తోపాటు వైసీపీ నేతలు, ఎస్ఐ జనార్ధన్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications