వేరే రాష్ట్రానికి వివేకా హత్య కేసు దర్యాప్తు - సుప్రీంకోర్టు మరో నిర్ణయం !
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీనికి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఇవాళ ఈ తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు మరో వారంపాటు దాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ రద్దు విషయం కూడా హత్య కేసు దర్యాప్తు బదిలీ అంశంతో ముడిపడి ఉన్నందున అదే రోజు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటిపోయినా సీబీఐ దర్యాప్తు మాత్రం ముందుకు సాగడంలేదు. దీనికి ఏపీలో అధికారంలో ఉన్నవైసీపీ ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు కేసు దర్యాప్తుకు చాలా కీలకంగా మారడంతో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ తీర్పు వెలువరించాల్సిన తీర్పును సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు.












Click it and Unblock the Notifications