ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్ల పునఃప్రారంభంపై కలెక్టర్ కీలక ప్రకటన..!
ఏపీలో భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్నా విజయవాడలో వరదలు మాత్రం కాస్త శాంతించాయి. దీంతో వారం రోజులుగా వరద ప్రభావానికి ఇచ్చిన సెలవుల నుంచి బయటపడేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు పనిచేస్తాయని ఆమె తెలిపారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు మాత్రం సెలవులు కొనసాగనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే విజయవాడలో బుడమేరు వరద ప్రభావంతో గత వారం రోజులుగా స్కూళ్లకు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో సిలబస్ పూర్తి కాక విద్యాసంవత్సరానికి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వరద తగ్గిన చోట స్కూళ్లను పునఃప్రారంభించేందుకు వీలుగా కలెక్టర్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు ఈనెల తొమ్మిదో తేదీ సోమవారం నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు.

అయితే ఇంకా పూర్తిగా నీటి ముంపు, పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవులు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి యూపీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రస్తుత భౌతిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతికి తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు.












Click it and Unblock the Notifications