నేడు స్కూళ్ల పునఃప్రారంభం , ఫీజుల మోత - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
నేటి నుంచి బడి గంట మోగనుంది. స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పేరెంట్స్ ఫీజుల భారంతో ఒత్తిడికి గురవుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వేసవి తీవ్రత తగ్గలేదు. పాఠశాలల ప్రారంభం వాయిదా వేయాలనే అభ్యర్ధనలు వచ్చాయి. వేసవి సెలవుల పొడిగింపుపైన ప్రభత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో ఈ రోజు నుంచి వారం పాటు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి విద్యా కానుక అందించనున్నారు.
ఏపీలో ఒంటిపూట స్కూళ్లు:
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. రాగి జావ ఉదయం 8:30 నుండి 9:00 లోగా అందించాలని..మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
విద్యార్ధులకు విద్యా కానుక:స్కూళ్లు ప్రారంభం అవుతున్న సమయంలో ఈ రోజు నుంచే విద్యార్దులకు విద్యా కానుక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విద్యార్ధికి రూ.2500విలువైన విద్యా కానుక కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంద చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా క్రోసూరులో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
అన్ని ప్రభుత్వ..ఏయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు వీటిని అందించనున్నారు. తెలంగాణలోనూ నేటి నుంచే పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ప్రత్యేక అవసరాల పిల్లలకు కార్యక్రమాలు, 16న ఆంగ్ల మాధ్యమంపై అవగాహన, 17న బాలికా విద్యతోపాటు కెరీర్ గైడెన్స్, 19న తెలంగాణ గ్రీన్ ఫెస్టివల్, 20వ తేదీన విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు.
భారీగా పెరిగిన ఫీజులు:పాఠశాలల ప్రారంభం వేళ మరోసారి ఫీజుల వ్యవహారం భారంగా మారుతోంది. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు భారీగా పెంచారు. గత ఏడాదితో పోలిస్తే కొన్ని 50 శాతం, మరికొన్ని 25శాతం పెంచాయి. కొన్ని స్కూళ్లల్లో ఒకటో తరగతికి కూడా రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు.
ఒకస్థాయి ఉన్న పాఠశాలల్లో ఫీజులు రూ.1.5 లక్షల కంటే ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల స్కూళ్లల్లో ఫీజుల బాదుడు ఎక్కువగా ఉంది. పుస్తకాలు, యూనిఫామ్స్ పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. బ్యాగులు, బెల్టులు, టైలు కూడా తమ వద్దే కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ పైన పలు సూచనలు చేసాయి. ఫీజులు అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications