కాకినాడ-షిర్డీ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్స్ పై రైల్వే క్లారిటీ..!
కొత్త ఏడాదిలో రైల్వేశాఖ పలు రైళ్ల రాకపోకల సమయాల్లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు ప్రయాణికుల వాటిని గమనించి ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని కోరింది. అయితే మారిన రైళ్ల సమయాల్ని ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు గమనించడం లేదు. ఏళ్ల తరబడి తమకు అలవాటైన సమయాల్లోనే రైళ్లు వస్తాయని స్టేషన్లలో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది.
కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సమయాల్ని రైల్వే శాఖ తాజాగా మార్చింది. జనవరి 1 నుంచి కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ను ఉదయం కాకినాడలో 6 గంటలకు బదులు ఐదు గంటలకే బయలుదేరేలా మార్చింది. అయితే ఇవాళ కూడా 5 గంటలకే రైలు బయలుదేరిపోయింది. కానీ చాలా మంది షిర్డీ వెళ్లాల్సిన ప్రయాణికులు 6 గంటలకు రైలు వస్తుందని స్టేషన్ కు వెళ్లి షాకయ్యారు. దీంతో వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేశారు.

దీంతో కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ను రాజమండ్రి స్టేషన్ లో చాలా సేపు ఆపేయాల్సి వచ్చింది. కాకినాడలో రైలు మిస్సయిన వారిలో కొంత మంది రాజమండ్రి వరకూ వచ్చి ఈ రైలు ఎక్కారు. దీంతో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాలపై దక్షిణ మధ్య రైల్వే స్పష్టత ఇచ్చింది. ఈ రైలు సమయాలు మారిన విషయాన్ని గమనించి ఇకపై ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికుల్ని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే మారిన సమయాల్ని మళ్లీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications