బియ్యం బండిని నడిపిన నిమ్మగడ్డ: త్వరలో హైకోర్టుకు వివరాలు: వైఎస్ జగన్ ఫొటోపై?
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు వెలువడుతోన్న వేళ.. జగన్ సర్కార్ కొత్తగా చేపట్టిన రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాలు ప్రస్తుతం రాజకీయాలకు కేంద్రబిందువుగా మారినట్టు కనిపిస్తోంది. నోటిఫికేషన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వాహనాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోని తెల్లరేషన కార్డుదారుల ఇళ్ల వద్దకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఈ వాహనాలను వినియోగిస్తోంది ప్రభుత్వం.
మంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీ

వాహనాలను పరిశీలించిన ఎస్ఈసీ..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నందు వల్ల.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే అవి రోడ్డెక్కనున్నాయి. ఈ పరిణామాల మధ్య- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ బియ్యం బండ్లను పరిశీలించారు. కొన్ని వాహనాలను ఆయన తన కార్యాలయానికి రప్పించుకున్నారు. తనిఖీ చేశారు. పని తీరు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వాహనాన్ని కొద్ది దూరం నడిపించారు. డ్రైవర్ కేబిన్‌లో కూర్చుని రేషన్ పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.

హైకోర్టుకు సమర్పించే అవకాశం..
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన రేషన్ బియ్యం వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ వాహనాలకు పూసిన రంగులు, అతికించిన స్టిక్కర్లు, ఫొటోల గురించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్.. ఆయా వాటి గురించి నిమ్మగడ్డకు వివరించారు. పేదలకు రేషన్ బియ్యాన్ని ఎలా పంపిణీ చేస్తారనేది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాహనంలో అమర్చిన పరికరాలు, జీపీఎస్ వ్యవస్థ, కాటా, అందులో ఎంతమంది సిబ్బంది ఉంటారు? వారెవరు? అనే వివరాలను నిమ్మగడ్డకు వివరించారు.

ముఖ్యమంత్రి ఫొటో.. ప్రభుత్వ లోగో
పేదలక ఇంటింటికీ బియ్యాన్ని పంపిణీ చేయాలనేది కొత్త పథకం కాదని కోన శశిధర్ మరోసారి ఆయనకు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించలేదని చెప్పారు. బియ్యం బండ్లపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండకూడదంటూ ఇదివరకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వాహనాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో, ప్రభుత్వ లోగో ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో- ముఖ్యమంత్రి ఫొటోను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.