రాజధాని, గ్రేటర్ రాయలసీమ: బాబుకు కొత్త తలనొప్పి!
హైదరాబాద్/కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడల మధ్య ఉంటుందనే వార్తల నేపథ్యంలో... రాయలసీమవాసులు తమ ప్రాంత అభివృద్ధి అంశంపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయకుంటే గ్రేటర్ రాయలసీమ కోసం డిమాండ్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఇంకా రాజధాని పైన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనందున కర్నూలు కోసం ప్రయత్నాలు చేయడం మాత్రం ఆపడం లేదు.
రాయలసీమకు చెందిన పలువురు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు... ఇలా పలు రంగాలకు చెందిన వారు.. రాజధాని, తమ ప్రాంతం అభివృద్ధి కోసం ఏకమవుతున్నారు.
రాజధాని ఎంపికలో చారిత్రక తప్పిదం జరుగుతోందని రాయలసీమకు చెందిన చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1956లో తెలంగాణ, సీమాంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధానిగా ఉన్న కర్నూలును హైదరాబాదుకు త్యాగం చేశామని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి కర్నూలునే రాజధానిగా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే, గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో కొంతమంది తమ ప్రాంత అభివృద్ధి పైన దృష్టి సారించారు. అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వకుంటే గ్రేటర్ రాయలసీమ అంశం ముందుకు వస్తుందని చెబుతున్నారు. ఇంకొంతమందిమాత్రం రాజధాని పైన పట్టు వీడటం లేదు.
రాయలసీమ హక్కుల వేదిక వ్యవస్థాపకులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తాము త్యాగం చేసినందున కర్నూలును రాజధానిగా చేయాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఉద్యమించేందుకు పలు రాయలసీమ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.
రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హమైనదని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మిజోరాం, త్రిపుర, గోవా, హర్యానా.. తదితర రాష్ట్రాల కంటే విస్తీర్ణంలో రాయలసీమ చాలా పెద్దది అని గుర్తు చేస్తున్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనేది న్యాయబద్దమైన డిమాండ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications