హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

45రోజుల్లో లక్షల కోట్ల రాజధాని దిశగా..: రేసులో ఐదారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన వాడివేడి చర్చ మొదలు కావడంతో సీమాంధ్ర రాజధానిపై కేంద్రం దృష్టి సారించింది. తొలుత పార్లమెంటులో బిల్లుకు ఆమోదం పొంది, 45 రోజుల వ్యవధిలోనే రాజధానిని నిర్ణయించాలన్న నిశ్చయంతో ఉంది. రాజధాని ఖరారైతే సాంకేతిక ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ఐదేళ్ల ప్రణాళిక ప్రకటించాల్సి ఉంటుంది. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకూ అవసరం కావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రాజధాని రేసులో ఐదారు నగరాల వరకు ఉన్నాయి.

ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాల్లో మైదాన ప్రాంతాన్ని సమీకరించి రాజధాని నిర్మించడం ఒక ఎత్తయితే, అటవీ ప్రాంతాన్ని డి నోటిఫై చేసి రాజధాని నిర్మించే యోచన కూడా కేంద్రం చేస్తోందట. రాజధాని ఏర్పాటుకు లక్ష ఎకరాల వరకూ స్థలం అవసరమన్నది ప్రాథమిక అంచనా. నీటి వనరులు, రహదారి, ఉపరితల రవాణా సౌకర్యాలతో పాటు అందరికీ అనువైన పట్టణంగా ఉండాలనే ప్రధాన ప్రాథమ్యాలతో రాజధాని ఎంపిక జరుగుతోంది.

Seemandhra struggles in Capital's search

అవసరమైతే కర్నూలు ప్రకాశం జిల్లాల మధ్య అటవీ ప్రాంతాన్ని డి నోటిఫై చేసే ఆలోచన కూడా కేంద్రం వద్ద ఉంది. కేంద్రం మదిలో వున్న ప్రాంతం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులకు అనువుగా ఉండటం, దీనిపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడంతో ఈ అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లా కృష్ణా నదీపరీవాహక ప్రాంతంలో కూడా స్థల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోపక్క రాజధాని ఏర్పాటు చేయాలంటే అయ్యే వ్యయం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక నిపుణులతో కసరత్తు ప్రారంభించింది. గతంలో మన రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్ సేవలను కేంద్రం ఇందుకోసం వినియోగించుకుంటోందట. రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు అనువైన పట్టణాలను అన్వేషించడంతో పాటు అక్కడ కొత్త రాజధాని ఏర్పాటు చేసినట్టయితే అయ్యే ఖర్చును కూడా కేంద్రం అంచనా వేస్తోంది.

ఒంగోలు, విశాఖ, విజయవాడ- గుంటూరు, విజయవాడ, మాచర్ల ఇలా అనేక ప్రాంతాల పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరులో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉండటం, ప్రకాశం జిల్లాలో ఓడరేవులు, చిత్తూరు జిల్లా అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా ఉండటం, విజయవాడ ట్రాన్స్‌పోర్టు హబ్‌గా విస్తరించడం, విశాఖపట్టణం వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుంటే మిగిలిన పట్టణాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదనే ఆలోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయానికి వెళ్తే విశాఖపట్టణం రాజధానిగా కొనసాగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్రం యోచిస్తోంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో రాజధాని ఏర్పాటు చేయాలని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోంది. రాయలసీమ - ఆంధ్రా ప్రాంతానికి కేంద్రంగా భావిస్తున్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన కూడా చురుగ్గా సాగుతోంది. దీనికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెబుతున్నారు.

రాష్ట్ర విభజనకు కారణమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట, విద్యాసంస్థలను ఇతర ప్రాంతాల్లోనూ, పారిశ్రామికవాడను మరో ప్రాంతంలోనూ ఏర్పాటు చేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని మొత్తంగా అభివృద్ధి చేసినట్టవుతుందని కేంద్రం భావిస్తోందట. విభజనకు తాము వ్యతిరేకంగా ఉన్నామని చెబుతున్న పార్టీలు అనివార్యమైతే సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిందేనని అంటున్నాయి. గతంలోనే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని ఏర్పాటు చేసినట్టయితే కనీసం ఐదు లక్షల కోట్లు వెచ్చించాలని డిమాండ్ చేశారు.

English summary

 The Congress party’s announcement on the bifurcation of Andhra Pradesh has triggered hectic lobbying for a new capital for the truncated State, with as many as six cities in the race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X