మళ్లీ హైకోర్టుకు ఏబీ వెంకటేశ్వరరావు-కోర్టు ధిక్కారమంటూ-సర్కార్ కు నోటీసులు
అమరావతి : ఏపీలో వైసీపీ సర్కార్ కూ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకూ మధ్య పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం రాగానే సస్పెండ్ చేశారు. గూఢచర్య పరికరాల్ని అక్రమంగా కొనుగోలు చేశారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసి అప్పటి నుంచి జీతం కూడా ఇవ్వలేదు. కానీ ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లి సస్పెన్షన్ రద్దు చేయించుకున్నారు. కానీ ప్రభుత్వం జీతం బకాయి మాత్రం అప్పటి నుంచి ఇవ్వలేదు.
సస్పెన్షన్ విధించిన కాలం నుంచి జీతం బకాయిలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం సస్పెన్షన్ ఎత్తేసిన సమయం నుంచి మాత్రమే చెల్లింపులు చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు సస్పెన్షన్ విధించిన సమయం నుంచి బకాయిలు ఇప్పించాలని, ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. ఏబీ తన పిటిషన్ లో సస్పెన్షన్ విధించిన నాటినుంచి పూర్తి జీతం ఇవ్వాలంటూ సీఎస్‌కు రెండుసార్లు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయినా తనకు జీతం ఇవ్వలేదని కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు కేవలం 2022 ఏప్రిల్ 22 నాటి నుంచే జీతం ఇచ్చారని, హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications