చంద్రబాబు దెబ్బకు ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పిన టీడీపీ సీనియర్ నేత
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
ఈ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. తొలి విడత జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మహదానందంగా ఉన్నానని అన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉందని అన్నారు.

తన ఆలోచనలు, నమ్మిన సిద్ధాంతాలు ఎలాంటివో కార్యకర్తలు, నాయకులు, అనుచరులకు తెలుసునని అన్నారు. తాను పదవుల కోసం పుట్ట లేదని వ్యాఖ్యానించారు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదని పేర్కొన్నారు.
రాజకీయాలు మన కళ్ల ముందే మారిపోయాయని మండలి బుద్ధ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు డబ్బే ప్రధానమై పోయిందని అన్నారు. ఓటరును ఒక కొనుగోలు వస్తువుగా భావిస్తోన్న ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో కొనసాగదలచుకోలేదని అన్నారు. ధనవంతుల కోసం పార్టీలు అన్వేషిస్తున్న పరిస్థితుల్లో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications