బొత్సకు అప్పుడే షాక్..! కుటుంబంలో తొలి నామినేషన్ తిరస్కరణ..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా ఉంటూ చక్రం తిప్పిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana)కు కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని తన రాజకీయ వారసురాలిగా బరిలోకి దింపుతున్న కూతురు బొత్స అనూష ఇప్పుడు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ రేసులో తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్రతో పోటీ ఎదుర్కొంటోంది. అదే సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బొత్స నలుగురు కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించగా..అందులో ఒకరికి ఇవాళ షాక్ తగిలింది.
బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు నిన్న విజయనగరం జిల్లాలోని వివిధ జడ్పీటీసీ స్ధానాల్లో వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో బొత్స సత్యనారాయణ సోదరుడి కొడుకు అయిన బొత్స చైతన్య కూడా ఒకరు. నిన్న జిల్లాలోని పూసపాటిరేగ మండల జడ్పీటీసీగా వైఎస్సార్సీపీ తరపున బొత్స చైతన్య నామినేషన్ వేశారు. అయితే చైతన్య ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తన ఓటు బదిలీ చేయటంపై జనసేన అభ్యర్థి కోట్ల రేవతి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి బొత్స చైతన్య నామినేషన్ ను తిరస్కరించారు.

ఈ మేరకు తగిన ఆధారాలు పరిశీలించిన తర్వాత పూసపాటిరేగ జడ్పీటీసీ స్ధానంలో బొత్స చైతన్య వేసిన నామినేషన్ ను తిరస్కరించినట్లుగా ఇతర అభ్యర్థులకు ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. దీంతో బొత్స కుటుంబంలో నామినేషన్ వేసిన నలుగురిలో ఒకరికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బొత్స కుటుంబ సభ్యుల్లో ఆయన కుమార్తె బొత్స అనూష.. బొండపల్లి జడ్పీటీసీ స్ధానానికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే గరివిడి జడ్పీటీసీ స్ధానం నుంచి బొత్స సత్యనారాయణ కోడలు అయిన బొత్స పూజిత, గుర్ల నుంచి బొత్స సత్యనారాయణ చెల్లెలు లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. మజ్జి శ్రీనివాసరావు తమను, పార్టీని వీడి వెళ్లిపోయిన తర్వాత విజయనగరం జిల్లాలో పట్టు నిరూపించుకునేందుకు బొత్స ఇలా తన నలుగురు కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్ధులు దొరక్కే వైఎస్సార్సీపీ తరఫున కుటుంబ సభ్యుల్ని ఆయన బరిలోకి దింపారని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
