బొత్స అనూష వర్సెస్ సిరి సహస్ర పోరు ఖరారు- ఇక తాడోపేడో..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు తోడూ నీడగా సాగిన బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు మధ్య పార్టీల రాజకీయాలు చిచ్చుపెట్టాయి. దీంతో తాజాగా మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను.. తన మేనమామ బొత్సతో పాటు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్సీపీని వదిలేసి కుమార్తె సిరి సహస్రతో కలిసి టీడీపీలో చేరిపోయారు. వీరిద్దరి మధ్య చిచ్చుకు కారణమైన విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ (Vizianagaram ZP Chairperson) సీటు రేసు మొదలైంది.
రాజకీయాల్లో తన వారసురాలిగా కుమార్తె బొత్స అనూషను ప్రకటించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. ఆమెను విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గా పోటీ చేయించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో అదే సీటుపై ఆశలు పెట్టుకున్న మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్రకు ఆశాభంగం అయ్యేలా కనిపించింది. దీంతో వెంటనే వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిపోయిన మజ్జి శ్రీనివాసరావు, సిరి సహస్ర.. తాము అనుకున్నది సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఇవాళ సిరి సహస్రతో పాటు బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష కూడా విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ స్ధానాలకు నామినేషన్లు వేశారు.

ముందుగా విజయనగరం జిల్లా తెర్లాం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ సిరి సహస్ర నామినేషన్ దాఖలు చేశారు. తండ్రి మజ్జి శ్రీనివాసరావుతో పాటు వచ్చిన సిరి సహస్ర రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ ఫైల్ చేశారు. దీంతో విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ రేసులో ఆమె ఉన్నట్లు తేలిపోయింది. అనంతరం బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష.. తన కుటుంబంలో జడ్పీటీసీలుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న మరో ముగ్గురితో కలిసి ఇంటి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం బొండపల్లి రిటర్నింగ్ అధికారి వద్ద జడ్పీటీసీ స్ధానానికి బొత్స అనూష నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు గరివిడి నుంచి బొత్స కోడలు పూజిత, పూసపాటిరేగ నుంచి బొత్సకు వరుసకు కుమారుడైన చైతన్య, గుర్ల నుంచి బొత్స సత్యనారాయణ చెల్లెలు లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ ఎన్నికల్ని బొత్స కుటుంబం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్దమవుతోంది.














Click it and Unblock the Notifications
