చంద్రబాబుకు సీఐడీ మరో షాక్? సన్నిహితుల ఆస్తుల జప్తుకు అడుగులు!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్ నెట్ స్కాంలో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురిని నిందితులుగా పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు వారిలో కొందరి ఆస్తుల జప్తుకు సిద్ధమవుతోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి హోంశాఖ అనుమతి కూడా మంజూరు చేసింది. దీంతో సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఏపీ ఫైబర్ నెట్ పరికరాల కొనుగోళ్ల కేసులో అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇందులో చంద్రబాబుకు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణకు చెందిన ఆస్తుల్ని అటాచ్ చేయబోతోంది. ఇందులో టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు మరో ఏడు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి అటాచ్ మెంట్ కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.

హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం ఫైబర్ నెట్ కేసులో సీఐడీ అటాచ్ చేయబోతున్న ఆస్తుల్లో గుంటూరులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావుకు చెందిన 797 చదరపు అడుగుల ఇంటిస్ధలం, విశాఖలోని కిర్లంపూడి లే అవుట్ లో ఉన్న కోటేశ్వరరావు కంపెనీ నెప్ టాప్ ఫైబర్ సొల్యూషన్స్ కు చెందిన ఓ ఫ్లాట్, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడలో ఉన్న నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఉంది. వీటి జప్తుకు సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారి ఆస్తుల అటాచ్ మెంట్ పూర్తి చేశాక చంద్రబాబు విషయంలో ఏం చేయాలన్న దానిపై సీఐడీ నిర్ణయం తీసుకోనుంది. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబును మరే ఇతర కేసుల్లోనూ చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ తదుపరి అడుగులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications