మంత్రి బుగ్గనకు సొంత వార్డులో షాక్-బేతంచర్లలో వైసీపీ గెలిచినా-అక్కడ మాత్రం టీడీపీ
ఏపీలో తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార వైసీపీ మెజార్టీ సీట్లు సాధించి దూసుకెళ్తోంది. అయితే ఇదే క్రమంలో వైసీపీకి అక్కడక్కడా ఎదురుదెబ్బలు కూడా తప్పడం లేదు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ వైసీపీతో టీడీపీ హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న స్ధానాల్లోనూ వైసీపీకి అక్కడక్కడా ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీకి తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకు గానూ వైసీపీ అత్యధికంగా 14 వార్డుల్లో గెలుపొందింది. టీడీపికి కేవలం ఆరు వార్డులు మాత్రమే దక్కాయి. అయితే బేతంచర్ల నగర పంచాయతీలోని 15వ వార్డును మాత్రం టీడీపీ అభ్యర్ధి కైవసం చేసుకున్నారు. ఈ వార్డు పరిధిలోనే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నివాసం ఉంటున్నారు. అంటే సొంత వార్డులో జరిగిన నగర పంచాయతీ ఎన్నికలో తమ పార్టీని గెలిపించుకోవడంలో బుగ్గన విఫలమైనట్లు తెలుస్తోంది.

బేతంచర్ల నగర పంచాయతీలో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బేతంచర్లలో నగర పంచాయతీని వైసీపీకి కోల్పోయిన టీడీపికి బుగ్గన నివాసముండే 15వార్డులో గెలుపొందడం ఊరటనిచ్చింది. దీంతో అక్కడ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లాలో తాజాగా సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ పలు ఎదురుదెబ్బలు తప్పలేదు. నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఓటమిపాలైనట్లయింది. ఇదే కోవలో జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి గెలిచారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో కర్నూలు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications