ఇప్పటానికి మళ్లీ షాక్- ఆ వాదన తోసిపుచ్చిన హైకోర్టు - లక్ష కట్టాల్సిందే.. !
ఇప్పటంలో కూల్చివేతలకు సంబంధించి గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ వారు పెట్టుకున్న అర్జీని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
గతంలో మున్సిపల్ అధికారులు తమకు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కూల్చివేతలు ఆపేసింది. ఆ తర్వాత సీఆర్డీయే అధికారులు తాము నోటీసులు ఇచ్చినట్లు ఆధారాలు సమర్పించారు. దీంతో పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్.. వారికి తలో లక్ష చొప్పున జరిమానా విధించింది. దీనిపై వారు తిరిగి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఇవాళ ఆ పిటిషన్ ను కొట్టేసింది.

ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన సింగిల్ బెంచ్ తీర్పుపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను కొట్టేసిన ధర్మాసనం..ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పిటిషనర్లు అంతా రైతులే వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసనానికి పిటిషనర్ల తరపున న్యాయవాది తెలిపారు. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేయటం మంచిది కాదని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications