• search
  • Live TV
కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అడ్డాలో జగన్ ఎత్తులకు హైకోర్టు బ్రేక్- ప్రత్యేకాధికారిపై ప్రశ్నలు- ఎస్ఈసీకి ఇరకాటం

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాల్లో విపక్షాన్ని జీరో చేసేందుకు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ అధికార పార్టీ వదలడం లేదు. ఇందులో భాగంగా విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలు గెలిచి ఆయనకు ప్రజా మద్దతు లేదని నిరూపించేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఇందుకోసం సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ వేసిన ఓ ఎత్తుకు హైకోర్టుకు చెక్ పెట్టింది.

జగన్ వర్సెస్ చంద్రబాబు

జగన్ వర్సెస్ చంద్రబాబు

ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుకు దశాబ్దానికి పైగానే చరిత్ర ఉంది. తొలుత తన తండ్రి వైఎస్సార్ హయాంలో టీడీపీ అభ్యర్ధిపై తొలిసారి ఎంపిగా నెగ్గిన జగన్ అప్పటి నుంచి ఆ పార్టీని శత్రువుగానే చూస్తుంటారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ తో జత కట్టడం ద్వారా జగన్ ను ఎదగనీయకుండా అడ్డుకున్న చరిత్ర టీడీపీది. అంతే వేగంగా ఈ వ్యూహాన్ని ఛేదించుకుంటూ ఎదిగిన చరిత్ర జగన్ ది. దీంతో జగన్, చంద్రబాబు పోరు ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంటుంది. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో జగన్ కు ఏమీ తెలియదని నిరూపించేందుకు చంద్రబాబు తంటాలు పడగా.. ఈ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సీనియార్టీ తప్ప బలం లేదని నిరూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రం గెలిచినా కుప్పంలో మాత్రం

రాష్ట్రం గెలిచినా కుప్పంలో మాత్రం

2019లో జరిగిన సార్వత్రిక పోరులో రాష్ట్రవ్యాప్తంగా భారీగా అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాలు కైవసం చేసుకున్న వైసీపీకి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మాత్రం నిరాశే ఎదురైంది. ఎంత ప్రయత్నించినా చంద్రబాబు మెజారిటీని తగ్గించడం మినహా వైసీపీ అక్కడ చేయడానికి ఏమీ లేకుండా పోయింది. అప్పట్లో చంద్రబాబుపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి ఈ మధ్యే చనిపోయారు. దీంతో చంద్రబాబును దెబ్బతీయడానికి తమకున్న ఏకైక అవకాశం చేజారిందని భావిస్తున్న వైసీపీ తాజాగా రూటు మార్చింది. దాదాపుగా రూరల్ నియోజకవర్గమే అయిన కుప్పంలో పంచాయతీలు, ఎంపీటీసీలు గెల్చుకుని సత్తా చాటుకున్నట్లు ప్రకటించుకుంది. అదే క్రమంలో కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చేసింది. దీంతో అక్కడా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.

కుప్పంలో జగన్ ఎత్తులు

కుప్పంలో జగన్ ఎత్తులు

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వచ్చే ప్రతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. ఇప్పుడు అక్కడ కొత్త వ్యూహాలకు తెరలేపారు. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడంతో పాటు అక్కడ ఎన్నికల్ని సైతం ఏకగ్రీవం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు సామాజికవర్గంతో పాటు ఆయన పార్టీ టీడీపీకి ఉన్న క్యాడర్ బలం అక్కడ వైసీపీ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తోంది. దీంతో వీరిని ఎదుర్కొనేందుకు తాజాగా దాడులకు సైతం దిగారు. దీంతో కుప్పం రాజకీయం రాష్ట్రాన్ని తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే అక్కడ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గెలిచిన వైసీపీ.. ఇప్పుడు మున్సిపల్ పోరులో విఫలమైతే రాజకీయంగా నష్టం తప్పదు. అప్పుడు చంద్రబాబుపై పైచేయి సాధించడం కష్టం. అందుకే ఇప్పుడు ఈ పోరును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

 కుప్పంలో ప్రత్యేకాధికారి నియామకం

కుప్పంలో ప్రత్యేకాధికారి నియామకం

రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేదా కార్పోరేషన్ లో స్ధానిక ఎన్నికలు జరిగినా అక్కడ కమిషనరే రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. కానీ ఇప్పుడు కుప్పంలో మాత్రం మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారిగా ఉండగానే ప్రత్యేకాధికారిగా పుంగనూరు నుంచి లోకేశ్వరవర్మ అనే అధికారిని తీసుకొచ్చారు. ఆయన కన్నుసన్నల్లో వైసీపీ జెండా ఎగరాలనే పట్టుదలతో అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో విపక్ష టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆయన వ్యవహారశైలి కారణంగా తెలుస్తోంది. దీంతో లోకేశ్వరవర్మ నియామకంపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్ఈసీతో పాటు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది.

 జగన్ ఎత్తులకు హైకోర్టు చెక్

జగన్ ఎత్తులకు హైకోర్టు చెక్

రాష్టంలో ఏ మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని విధంగా కుప్పంలో రిటర్నింగ్ అధికారి ఉన్నా కాదని ప్రత్యేకాధికారిని నియమించి అక్కడ ఎన్నికల పెత్తనం అప్పగించింది ఎస్ఈసీ. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనే పేరున్న ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేకాధికారి అవసరం ఏముందని ప్రశ్నించింది. దీంతో ఎస్ఈసీ, ప్రభుత్వ న్యాయవాదులు నీళ్లు నమలాల్సి వచ్చింది. చివరికి ప్రత్యేకాధికారికి ప్రత్యేక అధికారాలేవీ లేవని, రిటర్నింగ్ అధికారికి సహాయకుడిగా మాత్రమే ఉంటారని హైకోర్టుకు చెప్పుకొచ్చారు. దీంతో ప్రత్యేకాధికారి లోకేశ్వరవర్మ నియామకంపై టీడీపీ దాఖలు చేసిన ఫిర్యాదుపై తేల్చాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video

MLC Elections : బిగ్ ఫైట్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల కోలాహలం..! || Oneindia Telugu
ఎస్ఈసీ సచ్చీలత నిరూపించుకుంటారా?

ఎస్ఈసీ సచ్చీలత నిరూపించుకుంటారా?

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలో ప్రత్యేకాధికారి నియామకం ద్వారా ప్రభుత్వానికి ఎస్ఈసీ అనుకూలంగా వ్యవహరించాలని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీకి ఫిర్యాదులు కూడా చేస్తోంది. అయితే వైసీపీ సర్కార్ మాట కాదని ఇప్పుడు ప్రత్యేకాధికారిని తొలగిస్తే ప్రభుత్వ ఆగ్రహానికి గురి కాక తప్పదు. అలాగని హైకోర్టు చెప్పినా ప్రత్యేకాధికారిని కొనసాగిస్తే ఆ తర్వాత ఎలాంటి చిక్కులొస్తాయో తెలియదు. దీంతో ఇప్పుడు ప్రత్యేకాధికారి విషయంలో ఎస్ఈసీ నీలం సాహ్నీ చిత్తశుద్ధి చాటుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆమెపై విమర్శలు తప్పవు. దీంతో ఎస్ఈసీ పాత్ర మరోసారి కీలకంగా మారిపోయింది.

English summary
andhrapradesh high court sec nilam sawhney to resolve a complaint against speical officer appointment in kuppam municipal polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X