సాయిరెడ్డి కూతురికి హైకోర్టు బిగ్ షాక్-విశాఖ బీచ్ లో కూల్చివేతకు రెడీ..!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ బీచ్ లో చేపట్టిన కాంక్రీట్ నిర్మాణం విషయంలో జీవీఎంసీ చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు షాక్ తప్పలేదు. గతంలోనే ఈ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు.. వాటిని పక్కాగా అమలు చేయాల్సిందేనని విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీకి తేల్చిచెప్పేసింది.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలం పాటు ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కుమార్తె పెనాక నేహారెడ్డి భీమిలి వద్ద విశాఖ బీచ్ సమీపంలో ఓ కాంక్రీట్ నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణాన్ని అప్పట్లో విశాఖ నగర పాలక సంస్థ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. దీనిపై జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని స్పష్టం చేసింది.

దీంతో జీవీఎంసీ అధికారులు బీచ్ లో కాంక్రీట్ నిర్మాణం కూల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ బెంచ్ కూడా స్టే ఇవ్వలేదు. దీంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ కాంక్రీట్ గోడను కూల్చేయాలని హైకోర్టు జీవీఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ స్టే కూడా లేకపోవడంతో జీవీఎంసీ తదుపరి చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జీవీఎంసీ వాటి కూల్చివేతకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications